Breaking News

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

భువనగిరి: యశోద ఆస్పత్రి యాజమాన్యం కోసమే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి ప్రజలను కాపాడేందుకు వినియోగించాలని హితవు పలికారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వసతులను తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం గురువారం భువనగిరి జిల్లా ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంతా ఉద్యోగాల కోసమే అన్న రాజేంద్రా.. ఇప్పటి వరకు ఎన్ని నియామకాలు చేపట్టారో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగాల సంగతి దేవుడెరుగు కానీ వైద్యశాఖలోని ఖాళీపోస్టులను ఒక్కటైనా భర్తీచేశారా? అని ప్రశ్నించారు. మీ మాటలు పదవుల కోసమేనని ప్రజలకు అర్థమైందన్నారు. మీ నిర్లక్ష్యం కారణంగా పేదలకు సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ ఆస్పత్రులంటే ఆలయాలని, వైద్యులు దేవుళ్లలో సమానమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి తన రాజకీయ అవసరాల కోసం యజ్ఞాలు.. యాగాలు చేస్తుంటారని, అసలు వైద్యం అనే యజ్ఞం జరగాల్సిన, చేయించాల్సిన చోటు ఏది జరగడం లేదన్నారు. భువనగిరి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ 11 పోస్టులు ఉంటే 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డిప్యూటీ సివిల్ సర్జన్ 11 పోస్టులు ఉంటే 10 ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి యశోద వంటి కార్పొరేట్ ఆస్పత్రులను పెంచి పోసించాలన్నట్లు కనిపిస్తుందన్నారు. ఆస్పత్రుల్లో ఖాళీల గురించి చెప్పే లెక్కలన్నీ తనవి కాదని.. అధికారికంగా ఆస్పత్రుల్లో ఇచ్చిన గణాంకాలేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.