- రాత్రివేళ రాయలసీమ జిల్లాలకు మద్యం తరలింపు
- ఏపీలో అధిక ధరలు ఉండడంతో తెలంగాణ మద్యానికి గిరాకీ
సారథి న్యూస్, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తెలంగాణ ప్రాంతం నుంచి తుంగభద్ర నది దాటుతూ రాయలసీమ ప్రాంతానికి ప్రతి రోజు మద్యం తరలించేందుకు పుట్టిలో ప్రయాణిస్తున్నారు. ఆ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు పుట్టిలో 36 కేసుల మద్యాన్ని భారీస్థాయిలో తరించేందుకు ప్రయత్నిస్తుండగా, మధ్యలో వారి పుట్టి నదిలో బోల్తా పడింది. ఈ క్రమంలో రవికుమార్ అనే యువకుడు గల్లంతు కాగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గతంలో తెలంగాణ ప్రాంతమైన పుల్లూరు కలుగోట్ల తుమ్మిళ్ల ప్రాంతాల నుంచి ఇసుకను యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని రాయలసీమ ప్రాంతాలకు అక్రమంగా ఇసుకను తరలించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం మద్యం తరలించేందుకు ఈ దారిని ఎంచుకోవడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండడంతోనే తెలంగాణ ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి మద్యం కొనుగోలుచేసి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు ప్రతిరోజు ఇలాగే తరలించి అమ్ముకోవడం పరిపాటిగా మారింది.