- కొవిడ్ సంక్షోభ అనంతరం అనేక అవకాశాలు
- పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. తెలంగాణ ప్రపంచంలోని అనేక పెట్టుబడులకు ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని, అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్పాల్గొన్నారు. రెండు రోజులపాటు ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్’ పేరుతో నిర్వహిస్తున్న వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న సంక్షోభం ద్వారా ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందన్నారు. తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి ముందువరుసలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని వివరించారు. పల్లెలకు ఇంటర్నెట్ వెళ్లిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపుగా తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఆయారంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
హైదరాబాద్ ను స్టార్ట్ అప్ క్యాపిటల్‌గా తయారుచేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఐదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్ ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీతో పాటు దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్‌పార్క్ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్ తో పాటు దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ వంటి పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ప్లాన్ పేరుతో సీఐఐ రూపొందించిన నివేదికను విడుదల చేశారు.