Breaking News

డిజాస్టర్, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్లుకు ఆమోదం

డిజాస్టర్, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్లుకు ఆమోదం

సారథి న్యూస్, హైదరాబాద్: శాసనసభలో తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్లు– 2020 ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోత విధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. దాన్ని ఇప్పుడు చట్టంగా మార్చేందుకు సభ మందుకొస్తున్నామన్నారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.577 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ చెల్లింపులు పోస్ట్ పోన్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో చెల్లంచాలన్న ఉద్దేశంతో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు.

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం చెల్లింపులు ఆపివేశామన్నారు. బడ్జెట్ లో పెట్టుకున్న ఐదునెలలకు రూ.75,125 కోట్లు రావాల్సి ఉండగా, రూ.49,131 కోట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. స్టేట్ ఓన్ రెవెన్యూ రూ.7,850 కోట్లు తగ్గిందన్నారు. ఎప్పటిలోగా వేతనాలు ఇచ్చేది సీఎం పరిశీలనలో ఉందన్నారు. అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. కాగా, ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

అధ్యాపకుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు ఆమోదం
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి మెడికల్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కు పెంచుతూ ఈ బిల్లును తీసుకువస్తున్నాం.’ అని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. దీనివల్ల 52 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలు వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.

‘రిక్రూట్ మెంట్ పై కేసులు పడి స్టేలు ఉన్నాయి. ఉన్న అధ్యాపకులు రిటైర్డ్ అవుతున్నారు. ఈ కారణం వల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది తగిన వసతులు, అధ్యాపకులు ఉన్నారా? లేదా? అని పరిశీలించి సీట్లు కేటాయిస్తుంది. సీట్లు కోల్పోకుండా ఉండేందుకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా టీచింగ్ స్టాఫ్ కు మాత్రమే పదవీ విరమణ వయోపరిమితి పెంచాం’ అని ఎమ్మెల్యే సీతక్క అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్ రావు సమాధానమిచ్చారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.