సారథి న్యూస్, అనంతపురం: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు సచివాలయ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. జులై 8న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీచేసి ఆ తర్వాతే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే రచ్చబండ, ప్రజాదర్బార్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి నవరత్నాల ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలుతీరు, నగదు బదిలీ పథకంపై వారిని అడిగి తెలుసుకోనున్నారు.
వైఎస్సార్ జయంతి తర్వాతే
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ మోహన్‌రెడ్డి తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పేరుతో అమలు చేస్తున్నారు. ఏవైనా సరిదిద్దుకోవాల్సి వస్తే తండ్రి తరహాలోనే వాటిని సరిదిద్దుకుని మరింత పారదర్శకంగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తన తండ్రి వైఎస్సార్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 27లక్షల మంది నిరుపేదలకు ఆయన పేరుమీద పట్టాల పంపిణీ చేయాలని బృహత్తర కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. జులై 8న ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసి ప్రజల ముందుకు వెళ్లాలని సీఎం జగన్‌నిర్ణయం తీసుకున్నారు.
వలంటీర్ వ్యవస్థపై ఆరా
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ ఏపీలో గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల వద్దకు సులభంగా తీసుకెళ్లేందుకు ఆయన ఈ వ్యవస్థను ఎంచుకున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు వారి సొంత గ్రామాల్లోనే ప్రజలకు సేవచేసేలా సచివాలయ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ సర్కార్ ఏర్పాడి ఏడాది పూర్తవడం, సచివాలయ వ్యవస్థ ఎలా నడుస్తుంది.. ముందుకు నడిపించాల్సిన వలంటీర్లు ప్రజలకు ఏ విధంగా సేవలందిస్తున్నారు.. ఈ వ్యవస్థలో ఇంకా ఏమైనా మార్పులు తీసుకురావాలా? అన్న కోణంలో ఆరా తీస్తూ.. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు గ్రామ సచివాలయాల పనితీరును తెలుసుకునేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
విమర్శలను తిప్పకొడుతూ..
ఏడాది కాలంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అనేక సందర్భాల్లో జగన్ సర్కార్‌పై ఎద్దఎత్తున విమర్శలు, నిరసనలు, ధర్నాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇదే సందర్భంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగి సరైన సమాధానం చెబుతూ వస్తున్నారు. ఈ సందర్భంలో అనేక జిల్లాల్లో ఇరుపార్టీల మధ్య మాటలయుద్ధం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజలకోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అందుకోసం ఖర్చుచేసిన వ్యయం, గత ప్రభుత్వం చేసిన అప్పులు, అమలుకాని హామీలు, అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో ప్రజలకు స్పష్టత ఇచ్చి ప్రతిపక్ష విమర్శలకు అదే వేదికపై ప్రజలతోనే సమాధానం చెప్పించేందుకు సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు.
- June 11, 2020
- Archive
- అనంతపురం
- ఆంధ్రప్రదేశ్
- APCM
- Jagan
- PRAJADARBAR
- టీడీపీ
- ప్రతిపక్షాలు
- Comments Off on జగన్.. ప్రజాబాట