Breaking News

చివరి ఆయకట్టు దాకా నీళ్లందాలి

చెరువులు, రిజర్వాయర్లు నింపాలె
  • ఇరిగేషన్​శాఖలో నాలుగు విభాగాలు వద్దు
  • ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని, కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు నింపాలని, తర్వాత రిజర్వాయర్లు నింపాలని, చివరికి ఆయకట్టుకు సాగునీరు అందించాలని సూచించారు. ఆదివారం ప్రగతిభవన్ లో ప్రాజెక్టులు, నీటి పారుదల సౌలభ్యం తదితర అంశాలపై మంత్రులు, ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, నీటి పారుదలశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరదకాల్వకు వీలైనంత ఎక్కువ ఓటీలు ఏర్పాటుచేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలని సూచించారు.

ప్రభుత్వ శ్రమ ఫలితం ప్రజలకు అందాలె
గోదావరి, కృష్ణానదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మించిందని, పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసిందని సీఎం కేసీఆర్​వివరించారు. ఉద్యమస్పూర్తితో చెరువులను పునరుద్ధరించిందని, ఈ పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గమన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల ద్వారా ఇప్పుడు పుష్కలంగా నీటిలభ్యత ఏర్పడిందని, అలా వచ్చిన నీటిని సంపూర్ణంగ వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్​సూచించారు.

అవసరానికి తగ్గట్టు నీటిని వాడుకోవాలి
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగిందని, కావునా ఎస్ఆర్ఎస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలని అన్నారు. వరద కాల్వ, కాకతీయ కాల్వ, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయని, ప్రాజెక్టులో ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలని, అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్సారెస్పీ నీటిని వాడుకోవాలని సూచించారు. గోదావరి నుంచి నీరొస్తే నేరుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలని, లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలని సూచించారు. ఎల్లంపల్లి నుంచి 90వేల ఎకరాలలోపే ఆయకట్టుకు నీరందిండం సాధ్యమవుతుందని, మిగతా ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీరు అందించాలని సీఎం ఆదేశించారు.

చెరువుల సామర్థ్యం పెంచాలి
ఈ ఏడాది కృష్ణానదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉందని, ఇప్పటికే నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలారని, వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలని సీఎం కేసీఆర్​ సూచించారు. రామన్​పాడ్​రిజర్వాయర్ నింపాలని, కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డీ 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తిచేసి, ఈ ఏడాదే 30వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ధేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్దమొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలని, లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలని సూచించారు.

ఒకే విభాగం కింద నీటి పారుదలశాఖ
సాగునీటి వ్యవస్థ సమర్థవంత నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలని, ఎక్కువ జోన్లను ఏర్పాటుచేసి, ప్రతి జోన్ కు ఒక సీఈని బాధ్యుడిగా నియమించాలని సూచించారు. సీఈల పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలని, గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్నతరహా, ఐడీసీ అని నాలుగు విభాగాలుగా ఉండొద్దన్నారు. నీటి పారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని సూచనలు చేశారు. ప్రతిస్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరుచేసే అధికారం కల్పించాలన్నారు. సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, కొప్పుల ఈశ్వర్, ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్లు, జి.జైపాల్ యాదవ్, సుంకె రవిశంకర్, సంజయ్, కె.విద్యాసాగర్ రావు, కందాల ఉపేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్​సీలు మురళీధర్, అనిల్, పలువురు సీఈలు, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రితో ఫోన్లో సంభాషించిన కతలాపూర్ జడ్పీటిసి భూమయ్య, రైతు శ్రీపాల్ ను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.