సారథి న్యూస్, మెదక్: ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. శంకుస్థాపన చేసిన ఐదేళ్ల తర్వాత ప్రధానమైన ఆనకట్ట ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండటంతో అసలు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జరుగుతాయా? లేదా? అన్న సందేహంలో ఉన్న వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట కలిగినట్టయింది. ఆనకట్ట ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనంగా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
నిజాం నవాబుల కాలంలో నిర్మాణం
మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ ఘనపూర్ ఆనకట్ట. నిజాం నవాబుల కాలంలో 1905లో మంజీరా నదిమీద కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద ఆనకట్టను నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతంలో తీవ్ర కరువు నెలకొని వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందట. ఈ నేపథ్యంలో అప్పటి నిజాం ప్రభువు రైతుల సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీర్చేందుకు జిల్లా మీదుగా ప్రవహించే మంజీరా నదిమీద ఆనకట్ట కట్టించారు. ఈ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు. దీని కింద కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేలి ఘనపూర్ మండలాల పరిధిలో సెటిల్ ఆయకట్టు 21,625 ఎకరాలు ఉంది. ఆయకట్టు పొలాలకు సాగునీటిని అందించేందుకు కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో 42 కి.మీ. మేర మహబూబ్‌నహర్ కాల్వ, పాపన్నపేట మండలంలో 18 కి.మీ. మేర ఫతేనహర్ కాల్వ, 27 కి.మీ. మేర బ్రాంచ్ కెనాల్ ను నిర్మించారు.
పేరుకుపోయిన పూడిక
ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు పొలాల సాగు అవసరాల కోసం ఎగువన సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న సింగూర్ ప్రాజెక్టులో 4.06 టీఎంసీల నీటివాటా ఉంది. వానాకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగుకు అవసరమైన నీటిని విడతల వారీగా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి విడుదల చేస్తారు. ఘనపూర్ ఆనకట్టకు చేరిన నీటిని రెండు కాల్వల ద్వారా ఆయ మండలాల పరిధిలోని చెరువులు నింపడంతో పాటు బ్రాంచ్ కెనాళ్ల ద్వారా ఆయకట్టు పొలాలకు చేరుతాయి. అయితే ఆనకట్టలో పెద్దమొత్తంలో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. దీంతో సెటిల్ ఆయకట్టు అంతటికి సాగునీరు అందడం లేదు. పూడిక ఉండడంతో కెపాసిటీ మేర నీరు నిల్వ ఉండడం లేదు. నది పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిసి లేదా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసిన సమయాల్లో ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండినా రెండు, మూడు రోజుల్లోనే ఖాళీ అయిపోతోంది. దీంతో ఆయకట్టు పరిధిలో 10–12 వేల ఎకరాలకు మించి పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంటోంది.
ముఖ్యమంత్రి హామీతో..
సీఎం కేసీఆర్ మెదక్ నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు 2014 డిసెంబర్ 17న జిల్లాకు వచ్చిన సందర్భంగా ఘనపూర్ ఆనకట్టను సందర్శిం చడంతో పాటు, హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ ద్వారా ఆనకట్ట స్థితిగతులు, ఆయకట్టు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచాల్సిన ఆవశ్యకత గుర్తించిన సీఎం రూ.50 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రపోజల్ పంపగా, ఎత్తు పెంపు పనులతో పాటు ముంపుతో భూములు కోల్పోయే రైతులకు పరిహారం కోసం ప్రభుత్వం రూ.43.64 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు 2015 మే 6వ తేదీన అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు శంకుస్థాపన చేశారు. ఇరిగేషన్ అధికారులు టెండర్ ప్రాసెస్ పూర్తిచేయగా కాంట్రాక్టర్ వెంటనే పనులు షురూచేశారు. ఆనకట్ట కింది వైపు ఆఫ్రాన్, ప్రొటెక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. కానీ ముఖ్యమైన ఆనకట్ట ఎత్తు పెంచే పనులు మాత్రం జరగలేదు.
పూర్తికాని భూసేకరణ
నీటి నిల్వసామర్థ్యం పెంచేందుకు ఘనపూర్ ఆనకట్టను 1.75 మీటర్ల ఎత్తు పెంచాలని నిర్ణయించారు. అయితే ఆనకట్ట ఎత్తు పెంచడంతో కొల్చారం, పాపన్నపేట మండలాల పరిధిలో మంజీరా నది పరీవాహక ప్రాంతంలో 193 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని అధికారులు గుర్తించారు. పాపన్నపేట మండలం నాగసాన్పల్లి పరిధిలో 119 మంది రైతులకు సంబంధించి 88.13 ఎకరాలు, కొడపాక గ్రామ పరిధిలో 147 మంది రైతులకు సంబంధించి 41.8 ఎకరాలు, చిత్రియాల పరిధిలో ఇద్దరు రైతులకు సంబంధించి 14 గుంటల భూమి, అలాగే కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామ పరిధి రైతులకు సంబంధించిన 63 ఎకరాలు మునిగిపోతుంది. ముంపుతో భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఫండ్స్ కేటాయించింది. ఈ మేరకు ముంపుతో భూమి కోల్పోయే రైతులతో రెవెన్యూ అధికారులు చర్చించి పరిహారం చెల్లించి భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది.
పరిహారం విషయంలో అంగీకారం కుదరలేదు. దీంతో నాలుగేళ్ల కాలంగా పనులు పెండింగ్ లో ఉండగా, గతేడాది చివరలో పాపన్నపేట మండలంలోని గ్రామాల రైతులను ఒప్పించి భూసేకరణ ప్రక్రియను పూర్తిచేశారు. కానీ కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామ పరిధిలో 63 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండడంతో పనులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రెవెన్యూ అధికారులు ఘనపూర్ రైతులను ఒప్పించి అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తిచేశారు. దీంతో ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు లైన్ క్లియర్ అయింది. దీంతో వారంరోజుల క్రితం ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయి. ఇవి పూర్తయితే ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు పెరుగుతుంది. అప్పుడు సెటిల్ ఆయకట్టు 21,625 ఎకరాలతో పాటు అదనంగా మరో ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.