సారథి న్యూస్, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇన్చార్జ్లతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్1 నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల నియోజకవర్గాల వారీగా నియమించిన ఎన్నికల ఓటర్ల నమోదు ఇన్చార్జ్లు తమ పనులు మొదలు పెట్టారని వివరించారు. టీఆర్ఎస్ తరఫున 60లక్షల మంది కార్యకర్తల బలం ఉందని, ఇందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే మరోసారి అందరితో మాట్లాడతానని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అంతా తమ తమ కుటుంబాలతో సహా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.