Breaking News

గోప్యతే ముంచుతోంది

గోప్యతే ముంచుతోంది

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రస్తుతం సామూహిక వ్యాప్తి దశలో ఉందని, మరో నాలుగు వారాలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సినీనటుడు అమితాబచ్చన్‌ నుంచి.. హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వరకూ.. కరోనా సోకిన ప్రముఖుంతా తమ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, కరోనా సోకినా అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు సందేశాలిస్తున్నారు. తద్వారా బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఇలా చెప్పడం ద్వారా చుట్టుపక్కల వారు జాగ్రత్తపడేలా, నియమనిబంధనలు పాటించేలా వారు సలహాలు ఇస్తున్నారు. అయితే సామాన్యులు, మధ్యతరగతి జనం, అధికారులు సైతం ఈ విషయంలో అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. తమకు లేదా తమ బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, సిబ్బందిలో ఎవరికైనా కరోనా సోకితే.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఫలితంగా వైరస్‌ సామూహిక వ్యాప్తికి మరింతగా దోహదపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చంచల్‌గూడ జైలులో ముగ్గురు వార్డర్లకు కరోనా
తాజాగా, చంచల్‌గూడ జైలులోని ముగ్గురు వార్డర్లకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఇటీవల శిక్షపడ్డ ఖైదీ అక్కడికి వచ్చిన ఓ కొత్త ఖైదీని వారు చెక్‌ చేశారు. ఈ క్రమంలో ఆ ఖైదీకి అప్పటికే జ్వరం రావడం, అనంతరం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలడం జరిగిపోయాయి. దీంతో జైలు అధికారులు, అతని చెక్‌ చేసిన వార్డర్‌, అతనితో సన్నిహితంగా ఉన్న ఇతర వార్డర్లకు పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలంటూ జైలు సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు సిబ్బందికి సూచించినట్టు సమాచారం. ‘ఈ విషయం తెలిస్తే మిగతా సిబ్బంది డ్యూటీకి వచ్చేందుకు నిరాకరిస్తారు.. మనకు అసలే సిబ్బంది కొరత ఉంది. కాబట్టి ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచండి..’ అంటూ వారు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

అయితే పాజిటివ్‌ వచ్చిన వారు అక్కడి క్వార్టర్లలోనే నివాసం ఉంటుండడంతో ఇతర వార్డర్లు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది. కరోనా ప్రబలిన వారికి జైలు ప్రాంగణంలోని ఏదో ఒక కార్యాలయం లేదా గదిని కేటాయించి, వారిని ప్రత్యేకంగా ఉంచితే ఇతరులకు వైరస్‌ సోకకుండా ఉంటుంది. అందుకు విరుద్ధంగా వారందరినీ క్వార్టర్లలోనే ఉంచడం, విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఏం చేయాలో అర్థంకావడం లేదని వారు చెబుతున్నారు. ‘అందరం క్వార్టర్లలోనే ఉంటున్నాం. అలాంటప్పుడు వైరస్‌ సోకిన వారిని సపరేట్‌గా ఉంచాలి. లేదంటే రేపు మాకు, మా కుటుంబ సభ్యులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది..’ అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ ఇప్పుడు పాజిటివ్‌ వచ్చిన వారి వల్ల తమకు వైరస్‌ సోకితే.. తమ నుంచి జైల్లోని ఖైదీలకు కూడా సోకే ప్రమాద ం ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ఈ అంశంపై దృష్టి సారించాలని జైలు సిబ్బంది, ఉద్యోగులు కోరుతున్నారు.