Breaking News

గాన గాంధర్వుడు ఇకలేరు

గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్యగాయకుడు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తుదిశ్వాస విడిచారు. కరోనాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 10వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే ఆయన ఆరోగ్యం మెరుగపడిందని జనరల్​వార్డుకు షిఫ్ట్​అయ్యారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అంతకుముందు ఆయనకు ఎక్మా సహా లైఫ్​సపోర్ట్​సాయంతో చికిత్స అందించారు. అయితే శుక్రవారం 1.04 నిమిషాలకు ఆరోగ్యపరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు హెల్త్​బులెటిన్​ను విడుదల చేశాయి.
తండ్రి కోరిక మీద..
ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో 1946 జూన్ 4న బాలు ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చదివారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు.
చదువుకుంటూనే..
బాలసుబ్రహ్మణ్యానికి సంగీతం, సినిమాలన్నా ఎంతో మక్కువ ఆయన చదువుకునే రోజుల్లోనే ఎన్నో కచేరీలు ఇచ్చేవారు. అయితే తొలిసారిగా 1966లో విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాటపాడారు. ఆ తర్వాత ఆయన అనేక సినిమాల్లో పాడారు.
హీరోలకు గొంతు కలపడం ప్రత్యేక
తెలుగులో ఎంతోమంది నేపథ్య గాయకులు ఉన్నప్పటికీ బాలుకు ప్రత్యేక, విలక్షణమైన స్థానం ఉండేది.అదేమిటంటే హీరో ఎలా మాట్లాడుతారో.. అదే స్టైల్​లో పాటపాడడం. ఈ ప్రత్యేకతే ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది.ఈటీవీలో ప్రసారమయ్యే ‘పాడుతాతీయగా’ అనే కార్యక్రమం ద్వారా బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశారు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను పరిచయం చేశారు. 1966 లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది.
నటుడిగా గుర్తింపు
1969 లో మొదటిసారి నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రాక్షకుడు (1997), దీర్ఘసుమంగళీభవ (1998) తదితర చిత్రాల్లో ఆయన నటించిమెప్పించారు.
డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా..
కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి బాలూ డబ్బింగ్​ చెప్పాడు. టీడీ రంగంలోనూ బాలూ ఎంతో ప్రతిభను చాటారు. ఈటీవీలో ఆయన వ్యాక్యాతగా వ్యవహరించిన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలు ఎంతో పాపులర్​ అయ్యాయి. పలువురు నూతన గాయనీగాయకులను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాయి.
అవార్డులు..
బాలసుబ్రహ్మణ్యం.. కేంద్రప్రభుత్వం నుంచి 2001 లో పద్మశ్రీ పురస్కారం, 2011లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందజేసింది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఆయనకు ఎన్నో అవార్డులు ఇచ్చి సత్కరించాయి.