- దేశంలో 21రోజుల్లోనే రెట్టింపైన కోవిడ్ కేసులు
- 24గంటల్లో కొత్త కేసులు 62వేలు, 886 మరణాలు
- భారత్‌లో 41వేలు దాటిన కరోనా మరణాలు
ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒక్క రోజు నమోదవడం భారత్లో ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల 7వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. శుక్రవారం50వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68శాతానికి పెరిగింది. కోవిడ్ మరణాల రేటు 2.07శాతంగా ఉంది.
24గంటల్లో 886 మంది మృత్యువాత:
భారత్లో కరోనా మృతుల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం 800లకు పైగా కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మరో 886మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 41,585కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 2.07శాతంగా ఉంది.
9 రోజుల్లోనే 5లక్షల కేసులు..
గడిచిన తొమ్మిది రోజుల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి 21రోజుల సమయం పడుతోంది.
మహారాష్ట్రలో మూడోసారి 300మరణాలు…
కోవిడ్ మహమ్మారి తీవ్రతకు మహారాష్ట్ర వణికిపోతోంది. నిత్యం దాదాపు పదివేల కేసులు, 300మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 11,500 కేసులు నమోదుకాగా మరో 300మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య4లక్షల 80వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 16,700 మంది మరణించారు. తమిళనాడులోనూ నాలుగోసారి 100మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు తమిళనాడులో కరోనా సోకి 4500మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, తెలంగాణల్లోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది.