భాషతో సంబంధం లేకుండా విదేశీ చిత్రాలను కూడా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈమధ్య కాలంలో కొరియన్ సినిమాలు, అక్కడి కథలు, వెబ్ సిరీస్ లాంటివి మన వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ క్రమంలో మన దర్శకులు కూడా అలాంటి సినిమాలను ఇక్కడి వారి అభిరుచికి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. రీసెంట్ గా రీమేక్ అయిన ‘మిస్ గ్రానీ’ కొరియన్ సినిమా ‘ఓ బేబి’తో సమంత మెప్పించింది. ఈ సినిమాను నిర్మించిన సురేష్ బాబు కొన్ని నెలల క్రితమే మరో రెండు కొరియన్ రీమేక్స్ రైట్స్ తీసుకున్నారు. అందులో ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే యాక్షన్ కామెడీ డ్రామాను సుధీర్మ వర్మ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక మరో కొరియన్ సినిమా ‘డాన్సింగ్ క్వీన్’.
ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని శ్రీవాస్ డైరెక్ట్ చేయబోతున్నాడనేది లేటెస్ట్ అప్ డేట్. ఇప్పటివరకూ ఎక్కువగా యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలు తీసిన శ్రీవాస్ తన శైలికి పూర్తి భిన్నమైన రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించాలనుకోవడం విశేషం. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమాలో నటించేందుకు కాజల్ అగర్వాల్ అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. కాజల్‌కు జంటగా అల్లరి నరేష్ ఇందులో నటిస్తాడనే టాక్ కూడా వచ్చింది. తాజాగా డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ అవడంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. అయితే కొద్ది రోజుల క్రితం హిందీ ‘క్వీన్’ రీమేక్‌లో కాజల్ నటించింది. అనివార్య కారణాలతో అది ఇంకా రిలీజ్ కాలేదు. ఈలోపు డాన్సింగ్ క్వీన్ లో అవకాశం అందుకుంది కాజల్. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ బ్యాగ్ లో ఈ సినిమా కూడా చేరినట్టే.