Breaking News

కేంద్రీయ విద్యాలయం పిలుస్తోంది

ఉన్నత విద్యావంతులు, ఉత్తమ బోధన, పరిపూర్ణ సౌకర్యాలు, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్య కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్‌టూ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దడం, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ పాఠశాలలో ఒకసారి చేరిన తర్వాత సాధారణంగా బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. విద్యార్థులకు ప్రయోగపూర్వక బోధనతోపాటు, క్రీడలు, యోగాలో భాగస్వామ్యం చేస్తారు. డిమాండ్‌ దృష్ట్యా ప్రవేశం అంత సులువుగా లభించదు. ప్రవేశాల కోసం ఎంపిక పారదర్శకంగా జరగనుండడంతో ఒకటో తరగతిలోనే ప్రయత్నం చేయవచ్ఛు మిగిలిన తరగతులను ఆయా ఖాళీలను బట్టి భర్తీ చేస్తారు.
ఎవరికి ప్రాధాన్యం అంటే…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, బ్యాంకు, పోస్టల్‌ తదితర) ఉద్యోగులకు రెండో ప్రాధాన్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మూడో ప్రాధాన్యం. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు (ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్‌) తదితర ఉద్యోగుల పిల్లలకు నాలుగో ప్రాధాన్యం. మిగిలిన వారికి ఐదో ప్రాధాన్యంగా ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు అదనంగా లోక్‌సభ సభ్యులు (ఎంపీ) తన నియోజకవర్గం నుంచి ఏటా పది మంది విద్యార్థులకు సీట్లు ప్రతిపాదించొచ్ఛు. విద్యాలయ ఛైర్మన్‌ (కలెక్టర్‌) రెండు సీట్లను ప్రతిపాదించవచ్ఛు. వీరు ప్రతిపాదించే సీట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
ఎంపిక విధానం..
ఒకటో తరగతిలో 40 సీట్లు ఉంటాయి (ఎంపీ, పాలనాధికారి ప్రతిపాదిత సీట్లు అదనం). ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యక్రమంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను నేరుగా కేంద్రీయ విద్యాలయం సంఘటన్‌ ఆయా కేంద్రీయ విద్యాలయాలకు పంపుతుంది. విద్యాలయం నిబంధనల మేరకు 15 శాతం అంటే 6 సీట్లు ఎస్సీలు, 7.5 శాతం అంటే 3 సీట్లను ఎస్టీలకు కేటాయించారు. రెండు సీట్లు సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌కు లాటరీ ద్వారా కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం సీట్లు ఉంటాయి. ఓబీసీల కుటుంబాల పిల్లలకు 27 శాతం సీట్లు ఉంటాయి. మరోవైపు రెండో తరగతి నుంచి 11 తరగతి వరకు పాఠశాలలో ఉన్న ఖాళీలకనుగుణంగా ప్రవేశాలు ఇదే సందర్భంలో కల్పిస్తారు.
ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన ఇలా
మొదటి మెరిట్‌ లిస్టు (1వ తరగతి ప్రవేశాలు) ఆగస్టు 11న ప్రకటిస్తారు. రెండో మెరిట్‌ లిస్టు ఆగస్టు 24న వెల్లడిస్తారు. ఆగస్టు 26న మూడో మెరిట్‌ లిస్టు వెలువరిస్తారు. రెండు, మూడు మెరిట్‌ జాబితాలు ఖాళీలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. మొదటి నోటిఫికేషన్‌లో దరఖాస్తు ప్రక్రియకు అనుకున్నంతలో దరఖాస్తులు రాకపోతే ఆగస్టు 31న రెండో నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. దీనికోసం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 7 నుంచి 11వ వరకు ప్రవేశాలు కల్పిస్తారు. రెండు నుంచి పదో తరగతి వరకు తరగతి ఖాళీలను ప్రకటించి నోటిఫికేషన్‌ జారీచేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్‌ జాబితా ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు.
దరఖాస్తుల స్వీకరణ
జులై 20 నుంచి 25వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు, జులై 29న మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. జులై 30 నుంచి ఆగస్టు 7 వరకు ఫలితాలు విడుదల చేస్తారు.
ఫీజుల వివరాలు..
ఎస్టీ, ఎస్సీ బాలబాలికలకు ఫీజు ఉండదు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులు విద్యాలయ వికాస నిధి కోసం నెలకు రూ.500 చెల్లించాలి. 9, 10 తరగతుల విద్యార్థుల కంప్యూటర్‌ బోధన కోసం అదనంగా నెలకు రూ.200 చెల్లించాలి. 11, 12 తరగతులకు హ్యుమానిటీస్‌ కోర్సులైతే రూ.300, సైన్సు కోర్సులైతే రూ.400 చెల్లించాలి. కంప్యూటర్‌ కోర్సులు ఉంటే అన్ని రంగాల విద్యార్థులు నెలకు రూ.100 చొప్పున చెల్లించాలి. సైనికోద్యోగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం..
కేంద్రీయ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయిన తర్వాత నియమ, నిబంధనలకు పూర్తిగా చదివి ముందుకు వెళ్లాలి. రిజిస్ట్రేషన్‌లోకి వెళ్లిన తర్వాత లాగిన్‌ అయి దరఖాస్తు నింపాలి. ఒకసారి వివరాలను నమోదు చేసిన తర్వాత జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. పూర్తిగా పరిశీలించి అంతా సరిపోయినట్టు నిర్ధరణకు వచ్చిన తర్వాత సబ్‌మిట్‌ చేసి ప్రింట్‌ తీసుకోవాలి. ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత వాటిలో మార్పునకు ఆస్కారం ఉండదు. దరఖాస్తును నింపే క్రమంలోనే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తప్పులు లేకుండా చూసుకోవాలి.
ముఖ్య సమాచారం
ఒకటో తరగతి ప్రవేశాల దరఖాస్తుకు ఆగస్టు 7 సాయంత్రం 7 గంటలవరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్​లైన్​లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.
5 నుంచి 7 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలి