సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఈ మేరకు వారు ఏ విషయాలపై మాట్లాడుకుని ఉంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేంద్రప్రభుత్వం రాజధానుల విషయంలో జోక్యం చేసుకుంటుందని, గవర్నర్ ఈ బిల్లును ఆమోదించబోరని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ గవర్నర్ నిర్ణయంతో వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో సుజనాచౌదరితో కిషన్‌రెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ టీడీపీకి అనుకూలంగానే మాట్లాడుతుంటారు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని.. ఆయనే సుజనాను బీజేపీకి పంపించారని వైఎస్సార్సీపీ వర్గాలు ఎంతో కాలంగా ఆరోపిస్తున్నాయి. దేవుడు దిగొచ్చినా అమరావతి రాజధానిగా కాకుండా అడ్డుకోలేరని, బీజేపీ సరైన సమయంలో స్పందించి జగన్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందని గతంలో సుజనా ప్రకటించారు. దీంతో బీజేపీ అధిష్ఠానం.. సుజనాకు తలంటినట్టు సమాచారం. అప్పటి నుంచి ఆయన రాజధాని విషయంపై మౌనంగా ఉన్నారు.
తాజాగా, కిషన్‌రెడ్డితో సుజనా భేటీ కావడంతో చంద్రబాబు రాజధానిని అడ్డుకోవడానికి ఏదైనా కొత్త ఎత్తు వేశారా అని అనుమానిస్తున్నారు వైఎస్సార్సీపీ నాయకులు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం అంత సముఖంగా లేదని సమాచారం. అందుకే రాజధాని మార్పు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పక్కనపెట్టినట్టు బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ జోక్యం చేసుకుని రాజధాని మార్పును మార్చుతుందోమోనని పలువురు టీడీపీ నాయకులు ఆశపడుతున్నారట.