Breaking News

కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

  • కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి
  • ఇంత మోసపూరిత సర్కారును చూడలేదు
  • లోక్​సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

సారథి న్యూస్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, సీనియర్ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈనెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్ర వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్ ​రావు మాట్లాడుతూ.. ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణను పెడచెవిన పెట్టిందని, రాజ్యాంగబద్దంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదన్నారు. కేంద్రంతో ఇక పార్లమెంట్ లోనూ పోరాటం చేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. కృష్ణానది జల వివాదాన్ని కేంద్రం తేల్చడం లేదన్నారు. తెలంగాణలో సాగువిస్తీర్ణం 24శాతానికి పైగా పెరిగినా దానికి తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదన్నారు. కేంద్రం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. ఆ చట్టంతో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోందని, ఇక్కడి బీజేపీ నేతలు ఆ చట్టాన్ని సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. జాతీయ రహదారుల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు. కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలని, ఇంత మోసపూరిత సర్కారును చూడలేన్నారు. నవోదయ స్కూళ్లు తెలంగాణకు 22 కావాలని, అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. వరంగల్ లో టెక్స్​టైల్ పార్కునకు నయాపైసా ఇవ్వడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదు
అనంతరం టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్​లో మేము జరిపే పోరాటానికి ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిసి వస్తారో, రారో తేల్చుకోవాలని సవాల్​విసిరారు. తెలంగాణలో కాదు.. వారు ఢిల్లీలో మాట్లాడాలన్నారు. సీఎం కేసీఆర్​ఏడేళ్లుగా కేంద్రానికి ఉత్తరాలు రాసి అసిపోయారని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పార్లమెంట్​లో ప్రశ్నోత్తరాల సమయాన్ని తొలగించడం ఖండిస్తున్నామని అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మహబూబ్​నగర్ ​ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, చేవెళ్ల ఎంపీ డాక్టర్​రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, వరంగల్​ఎంపీ పసునూరి దయాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ పాల్గొన్నారు.