Breaking News

కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

అమరావతి: కృష్ణానది నీటి పంపకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ ​జగన్​మోహన్​రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ రాసిన లేఖపై మంగళవారం ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని వివరించారు. మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పిందని గుర్తుచేశారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని వివరించారు.

సమావేశానికి సంబంధించి ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న రాసిన లేఖ సరికాదని పేర్కొన్నారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని సీఎం జగన్‌ మోహన్​రెడ్డి స్పష్టంచేశారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కేవలం ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడంతో పాటు సమర్థంగా కాల్వల వ్యవస్థను వినియోగించుకోవడమేనని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదని స్పష్టంచేశారు. నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదని లేఖలో పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాను సక్రమంగా వాడుకునేందుకే ఈ ప్రాజెక్టు అని వివరించారు.
రాయలసీమ ప్రాజెక్టు పాతదే
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తది కాదని పేర్కొన్నారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలై ఉందని, ఆ రెండు ప్రాజెక్టులు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయని వివరించారు.

కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన నీటివాటాకు బద్ధులై ఉంటామని మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ చెప్పిందని గుర్తుచేవారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను నిలిపివేయాలని అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదని పేర్కొన్నారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించగా, ఈ సమావేశం జరగకుండా ఆగిపోయిందన్నారు.