– బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
– మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట వద్ద బావిలో పడి చనిపోయిన 9మంది మృతికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆమె 9 మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వలస కార్మికుడు కూడా ఆకలితో ఉండకూడదని సీఎం కేసీఆర్ అన్నిరకాలుగా వారికి అండగా నిలిచిన సమయంలో ఇలా 9 మంది వలస కార్మికులు చనిపోవడం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
బీహార్ కు చెందిన మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, వారు తీసుకెళ్లడానికి వస్తే అన్ని విధాల సహకరిస్తామని, లేకున్నా వారి కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు. చనిపోయిన 9 మందికి సంబంధించిన కుటుంబసభ్యులకు మంత్రి సత్యవతి రాథోడ్ వ్యక్తిగతంగా సాయం రూ.లక్ష ప్రకటించగా, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, అనుమానాస్పదంగా మరణించిన 9మంది మృతులకు సంబంధించిన కేసు ఛేదించడం కోసం ప్రత్యేక పోలీస్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ ప్రకటించారు.నిజనిజాలు తెలిశాకే చర్యలు: మంత్రి దయాకర్‌రావు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, నిజనిజాలు తెలిశాక చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. గొర్రెకుంట మృతుల డెడ్ బాడీస్‌ను మంత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరిశీలించారు. వివరాలను పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిందర్ ను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.