సారథి న్యూస్, మెదక్: విద్యార్థులు చదువు, విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆన్లైన్ క్లాసెస్‌ను ప్రతి విద్యార్థి వినేలా చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో ప్రత్యేక ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఈవో రమేశ్ కుమార్, ఆయా శాఖల అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం టీ శాట్, దూరదర్శన్ యాదగిరి చానెళ్ల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ క్లాసులకు బడిఈడు పిల్లలంతా హాజరయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు చూడాలని సూచించారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తొలిసారి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటుందని వివరించారు. ప్రతి పదిమంది విద్యార్థులకు ఒక కేర్ టీచర్ ఉండాలని, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి తల్లిదండ్రులకు విశ్వాసం కలిగించాలన్నారు. ప్రతి విద్యార్థి ఈ విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, టీచర్లపై ఉందన్నారు. మెదక్ జిల్లాలో 64,308 విద్యార్థులు చదువుతుండగా వారిలో 6,643 (10.3 శాతం) మందికి టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానల్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు వినే సౌలభ్యం ఉందని మంత్రి వివరించారు. సౌకర్యం లేని విద్యార్థుల గురించి ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎస్ఏంసీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు. గ్రామాలు, పట్టణాల్లోని సమీప ఇళ్లలో ఇంటర్నెట్, టీవీ వంటి సౌకర్యాలు ఉంటే వారితో సమన్వయం చేసుకుని విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాలని సూచించారు. అలాగే విద్యార్థులందరికీ నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్ చేరేలా టీచర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, డీఈవో రమేష్ కుమార్, జిల్లాల్లోని మండలాల డీఈవోలు, హెచ్ఎంలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.