Breaking News

కారు లేని నేత.. విశిష్టతల కలబోత

కారు లేని నేత.. విశిష్టతల కలబోత

  • బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన సున్నం రాజయ్య
  • ఆటోలో సెక్రటేరియట్​కు వచ్చిన ప్రజానేత

సారథి న్యూస్, హైదరాబాద్: ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు తరగదని ఆస్తులు సంపాదించుకుంటున్న రోజులివి.. కానీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని ప్రజానేత.. బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన ఘనచరిత.. ఆయనే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య. కరోనా బారినపడి కన్నుమూయడాన్ని ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు. సహజంగా ప్రజాప్రతినిధి అనగానే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా చాలా హంగామా తెలిసిందే. కానీ సున్నం రాజయ్య ఇందుకు పూర్తిభిన్నం. సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచినా.. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వెళ్లినా ఆర్టీసీ బస్సు, లేదా ఆటోలోనే వెళ్లేవారు. ఒక్కోసారి బైక్‌పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. రాజయ్య తన సొంత నియోజకవర్గం భద్రాచలంలో ఎక్కడికి వెళ్లినా బైక్​పైనే వెళ్లేవారు. చాలా సందర్భాల్లో భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సుల్లో వచ్చారు. ఇంకా గొప్ప విషయమేమిటంటే ఎమ్మెల్యేగా చేసినప్పుడు వచ్చే శాలరీలో సగం పార్టీకి ఇచ్చేవారు. మిగతా సగం… తన ఖర్చుల కోసం వాడుకునేవారు. ఈ రోజుల్లో ఇలాంటి నేతలు ఉన్నారంటే నమ్మడం కష్టమే. ఓసారి ఆయన బైక్‌పై వెళ్తూ కిందపడిపోయారు.


ఆటోలో సెక్రటేరియట్​కు.. బైక్​పైకి అసెంబ్లీకి
మూడుసార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా చేసినా… రాజయ్యకు సొంత కారు లేదు. ఓసారి రాజయ్య సాయంత్రం వేళ ఆటోలో తెలంగాణ సెక్రటేరియట్‌ కు వచ్చారు. ఆటోను లోపలికి అనుమతి ఇవ్వాలని సెక్యూరిటీని కోరగా అందుకు ఒప్పుకోలేదు. తాను ఎమ్మెల్యేను అంటూ రాజయ్య తన ఐడీ ప్రూఫ్ చూపించారు. అయినా సరే వాళ్లు నమ్మలేదు. ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆటోలో రావడం జరిగిందా..? కుదరదు అంటూ దాదాపు 20 నిమిషాల పాటు వాదనకు దిగారు. చివరకు మీడియా జర్నలిస్టులు రాజయ్యను గుర్తించి సెక్యూరిటీ సిబ్బందితో వాదించి ఆటోతో సహా ఆయనను లోపలికి పంపించారు. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది వణికిపోయారు. తమపై రాజయ్య కంప్లయింట్​ ఇస్తారేమో, ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తుందేమో అనుకున్నారు. రాజయ్య బయటకు వచ్చాక మీడియా ఇదే విషయం అడిగింది. ‘భలే వాళ్లే.. వాళ్లపై కేసు పెట్టి నేను సాధించేదేముంది? వాళ్ల పొట్టకొట్టడం తప్పితే’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. రాజయ్య మంచి మనసును మీడియా జర్నలిస్టులు మెచ్చుకున్నారు. ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని వార్తలు ఇచ్చారు.
తల్లడిల్లిన గూడెం గుండె
రాజయ్యకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. స్వగ్రామం నుంచి విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సున్నం రాజయ్య ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆదివాసీలు. అందరినీ చాలా ఆప్యాయతగా పలకరించి, చాలా నిరాడంబరంగా జీవించేవారనీ చివరికి ఇలా కరోనా కాటుకు బలవుతారని తాము అసలు ఊహించలేదని వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు. రాజయ్య మరణం మానవ సమాజానికి, గిరిజన, ఆదివాసీలకు తీరనిలోటని జోహార్లు అర్పిస్తున్నారు.