సారథి న్యూస్, రామాయంపేట: రైతులు తాము పండించిన పంటలను అరబెట్టుకోవాడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా కల్లాలను నిర్మించేందుకు ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారు. కల్లాల నిర్మాణం కోసం మెదక్ జిల్లాకు 22.7 కోట్లు నిధులను కేటాయించారు. జిల్లాలోని 20 మండలాల్లో కల్లాలను నిర్మించనున్నారు.
కల్లాల నిర్మాణానికి వీళ్లు అర్హులు
పంట నూర్పిడి కల్లాల నిర్మాణం కోసం చిన్న, సన్నకారు రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. వీరిలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ ఇస్తున్నారు. ఓసీ, బీసీ, ఇతరులకు 90 శాతం సబ్సిడీ మీద కల్లాలను నిర్మించనున్నారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కల్లాలను రూ . 56,000 అంచనాతో, 60 చదరపు మీటర్ల కల్లాల కోసం రూ. 68,000 అంచనాతో, 75 చదరపు మీటర్ల కల్లాల రూ.85,000 అంచనాతో నిర్మించనున్నారు. కల్లాల నిర్మాణానికి సంబంధించిన డబ్బులను రెండు విడుతలలో రైతులకు చెల్లించనున్నారు. రైతులు ఈ నెల 30లోపు పూర్తి వివరాలు, కులం, ఉపాధి హామీ జాబ్ కార్డు నంబర్, భూమి ఉన్న గ్రామం, భూమి సర్వే నంబర్ తదితర వివరాలతో మండల వ్యవసాయాధికారులను కానీ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోగానీ సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.