Breaking News

కరోనా వస్తే చావే శరణ్యమా?

కరోనా వస్తే చావే శరణ్యమా?

హైదరాబాద్ లో నివాసం ఉండే చిరు వ్యాపారికి కరోనా ప్రబలింది. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నచూపు చూస్తారనే భయంతో వరంగల్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తెల్లవారుజామున ఏపీలోని గుంటూరులోని ఓ ఐసోలేషన్ కేంద్రంలోనే మరొకరు ఉరివేసుకుని చనిపోయారు. గురువారం హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ రిటైర్ట్ ఉద్యోగి ప్రైవేట్​ ఆస్పత్రిలోని కిటికీలో నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

కరోనా మహమ్మారి జనాలను భయంతో చంపేస్తోంది.. పొరుగు వారు చూపుతున్న వివక్షకు తోడు.. చనిపోతామేమో అన్న బెంగే ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది.. రోగుల డెత్ రేట్ అతి తక్కువగా ఉంటున్నా.. కరోనా సోకితే మరణమే అన్న భయమే వెంటాడుతోంది.. దీంతో కొందరు రోగులు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. మాయదారి రోగం చంపేయకున్నా తమకు తామే సూసైడ్ ​చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ఇప్పటివరకు ఆరులక్షల మందిని బలితీసుకుంది. మన దేశంలో 12.5 లక్షల మందికి పైగా దీని బారినపడ్డారు. 30వేల మంది వరకు మరణించారు. ఏపీ తెలంగాణలో కలిపి 1.2లక్షల కేసులు బయటపడగా 1,300 మంది కరోనాకు బలయ్యారు. అయితే కరోనా కారణంగా సమాజంలో అసాధారణ, అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మానసిక స్థైర్యం దెబ్బతినొద్దు
కరోనా సోకిన వ్యక్తి పట్ల ఇరుగు పొరుగు వారు వ్యవహరిస్తున్న తీరుతో కరోనా రోగుల మానసిక స్థైర్యం దెబ్బతింటోంది. అన్ని మందులకన్నా ధైర్యమే అదిపెద్ద మందు. జయిస్తామన్న బలమైన నమ్మకం ఉంటే వైద్యచికిత్స సునాయసమవుతుంది. కానీ అలా కుండా కరోనాతో చనిపోతామనే భయం వెంటాడితే పెషెంట్లు కోలుకోవడం చాలా కష్టం. చనిపోతున్న వారిలో ఎక్కువ మంది ఈ కోవకు చెందినవారే ఉన్నారు. అందుకు వారు నిజంగా కరోనాతోనే చనిపోయారా? లేక భయంతోనా? అన్నది వైద్య నిపుణులకు కూడా అంతుచిక్కడం లేదు. ఇతర రోగులకు అందిస్తున్న చికిత్సనే వీరికి అందిస్తున్నా కోలుకోవడం కష్టంగా మారింది. డాక్టర్లు ఫరవా లేదు అనుకుంటున్న క్రమంలోనే ఒక్క సారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. ఏమీ కాదు దైర్యంగా ఉండండి.. మీకు ఎలాంటి ఇబ్బంది రాదని వైద్యసిబ్బంది విశ్వాసం కలిగిస్తున్నా పేషెంట్లలో మానసిక స్థైర్యం సన్నగిల్లుతోంది.

ఒత్తిడి, వివక్ష.. వెంటాడుతోంది
మరో వైపు కరోనా సోకిందనే భయం, సమాజం నుంచి వివక్ష ఎదుర్కొవాల్సి వస్తుందన్న భయం, తన వల్ల పక్క వారికి కరోనా సోకుతుందనే ఆందోళన వెరసి పెషంట్లు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. సాధరణంగా రోగులకు ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆ సమయంలో బంధువులు, సంబంధీకులు, ఆప్తులు ఇచ్చే ధైర్యం, అందే వైద్యాన్ని బట్టే వారు త్వరగా కోలుకుంటారు. కానీ కరోనా రోగులకు అలాంటి పరిస్థితి లేదు. వీరి నుంచి రోగం కుటుంభీకులకు సోకే అవకాశాలు అధికంగా ఉండటంతో వీరిని ఐసోలేషన్ లో ఉంచాల్సి వస్తోంది. ఫోన్లలో ఏవరెన్ని పరామర్శలు చేసినా ఒంటరి అనే భావన వీరిలో తలెత్తుంది. దీంతో రోగానికి ఒంటరి తనం తోడై, ఇరుగు పొరుగు వారి నుంచి నిందలు మోయాల్సి వస్తుందనే భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల్లో వరుసగా ముగ్గురు బలవన్మరణాలను పాల్పడ్డారంటే కరోనా రోగుల మానసిక ఆందోళన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మొండి వ్యాధులను జయించాం
అయితే కరోనా అంత భయంకరమైన వ్యాధి ఏమీ కాదు. మరణాల సంఖ్య అతితక్కువగా ఉంటుందన్న వాస్తవం వారికి చేరకపోవడమే ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. కరోనా కంటే భయంకరమైన ఎన్నో మహమ్మారులను ప్రపంచం జయించింది. స్పానిష్ ఫ్లూ, సార్స్, ఏబోలా వంటి వ్యాధులు ప్రపంచాన్నే గడగడలాడించాయి. లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. అప్పుడు మరణాల శాతం భారీగా నమోదైంది. సగటున ఈ రోగాలు సోకిన వారిలో ఐదుశాతం మంది మృత్యువాతపడ్డారు. అప్పట్లో సరైన వైద్యసదుపాయలు లేకపోవడం, ప్రజల్లో అవగాహన కొరవడడం వెరసి ఈ మయాదారి రోగాలు అతితక్కువ కాలంలోనే లక్షల మందిని బలిగొంది. ఈ వ్యాధులతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య అతితక్కువగా ఉంది. అది రెండు శాతానికి మించి ఉండడం లేదు.

కరోనా బాధితుల్లో 80 శాతానికి పైగా ఎలాంటి లక్షణాలు బయటపడడం లేదు. సుచి, శుభ్రత పాటిస్తూ పౌష్టికాహారం తీసుకున్న వారిలో కరోనా కనుమరుగవుతుంది. అంతెందుకు నిత్యం ఎన్నో రోడ్డు ప్రమదాలు జరుగుతున్నాయి. అందులో మరణించిన వారి సంఖ్య ఒక్క శాతమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రోడ్డు ప్రమాదం జరగ్గానే మరణిస్తామనుకుంటే ఎలా? మన జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలు. కరోనా విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ ప్రాథమిక అవగాహనను కరోనా రోగుల్లో అంతకు మంచి ప్రజల్లో కల్పించాలి. అప్పుడు కరోనా అంటే భయం, కరోనా రోగుల పట్ల వివక్ష తగ్గుతుంది.

ధైర్యమే గొప్పది
చికిత్స కన్నా ధైర్యమే గొప్పది. ముందు కరోనా సోకగానే మరణిస్తామనుకునే భయాన్ని వీడాలి. ఆత్మహత్యలు చేసుకోవడం సరైంది కాదు. కరోనా లక్షణాలు కనిపిస్తే మొదట డాక్టర్​ను సంప్రదించాలి. ఒకవేళ కోవిడ్​–19 నిర్ధారణ అయితే ఐసోలేషన్​లో ఉండి ట్రీట్​మెంట్​తీసుకోవాలి. దానికి తోడు పౌష్టికాహారం తీసుకుంటూనే బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఫిజికల్​డిస్టెన్స్ పాటిస్తూనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు డాక్టర్​ సలహాలు పాటించాలి.
:: డాక్టర్ ​బి.నాగార్జున, గాంధీ ఆస్పత్రి, వైద్యనిపుణులు

:: పీఆర్