Breaking News

కరోనా ల్యాబ్​ పెట్టొద్దు

సారథి న్యూస్, మెదక్: తమ ఇళ్ల సమీపంలో కోవిడ్​–19 నిర్ధారణ సెంటర్ ఏర్పాటు చేయొద్దని మెదక్​ పట్టణంలోని జంబికుంట వీధి ప్రజలు ఆందోళన చేపట్టారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ ల్యాబ్​ ఏర్పాటుపై శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి చేతులమీదుగా ల్యాబ్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేయగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్​ నాయకులు నిర్ణయించారు. కాగా పోలీసులు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి, 5వ వార్డు కౌన్సిలర్​ మామిళ్ల ఆంజనేయులును హౌస్​​ అరెస్ట్​చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చిన కాంగ్రెస్​ నాయకులు మధుసూదన్​రావు, గూడూరి ఆంజనేయులు గౌడ్​, కృష్ణ, దుర్గాప్రసాద్​ తదితరులను అరెస్ట్​ చేసి టౌన్​ పోలీస్​ స్టేషన్​ కు తరలించారు.

ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెహికిల్ ఆస్పత్రి వద్దకు రాగానే ఒక్కసారిగా మహిళలు, పురుషులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను పక్కకు తప్పించి ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చేందుకు కొందరిని అనుమతించారు. కరోనా ల్యాబ్​ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డితోపాటు కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి వారికి నచ్చజెప్పారు. అనంతరం ప్రారంభించారు.