– ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సారథి న్యూస్, అనంతపురం: కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోయేందుకు తీసుకునే చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా ప్రబలిన వారిపై వివక్ష చూపడం సరికాదని, వైఖరిలో మార్పు తీసుకురావాలన్నారు. కోవిడ్-19 నియంత్రణ చర్యలపై సీఎం జగన్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు.
కరోనాపై అవగాహన కల్పించాలి
కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే ప్రజలు పరీక్షలతో పాటు వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావాలన్నారు. కరోనాపై అవగాహన సమాచారాన్ని కరపత్రాలపై ముద్రించాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్ స్థాయికి కోవిడ్ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల్లో భౌతిక దూరం పాటించేలా దుకాణదారులే చొరవ తీసుకోవాలన్నారు. మండుటెండలో పిల్లాపాపలతో కాళ్లకు కనీసం చెప్పులు లేకుండా నడుస్తున్న వలస కూలీల పరిస్థితిని చూసి సీఎం జగన్ చలించిపోయారు. వారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలని సూచించారు. 24 గంటల్లో రాష్ట్రంలో 48 కేసులు నమోదైనట్లు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కొత్తగా నమోదైన 48 కేసుల్లో 31 కేసులు కోయంబేడు మార్కెట్‌కు సంబంధించినవి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో డిశ్చార్జ్ సంఖ్య బాగా పెరిగిందన్నారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ విధానం, ఇంటర్ వెన్షన్ విధానం కూడా చాలా ముఖ్యమైనవని, ఈ రెండు విషయాల్లో రైతు భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.