సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ నియంత్రణకు నిర్విరామంగా కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం విజయవాడలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డితో కలసి కోవిడ్ నియంత్రణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చేస్తున్న పనితీరును ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా మాస్కులు కట్టుకుని కోవిడ్ 19 ప్రొటోకాల్ పాటించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 4.73 లక్షల మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేశామన్నారు. 24 గంటల్లోనే ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించి హోం క్వారంటైన్లలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ఇందుకోసం స్థానిక పోలీసులు, ఎఎన్ఎం, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కర్నూలు జిల్లాలో 437 మంది మృత్యువాతపడ్డారని, జీజీహెచ్, శాంతిరాం, విశ్వభారతి ఆస్పత్రిలోనే అధికశాతం మరణించారని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం మరణాల రేటు 0.6శాతం ఉందన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రవి పట్టన్ షెట్టి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్‌చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో డాక్టర్గిడ్డయ్య పాల్గొన్నారు.