బతకడానికి పనిచేయడం మాత్రమే ఆస్తిగా ఉన్న జీవితాలు వాళ్లవి. చదువులూ, సంపదలూ లేకున్నా ఎలాగైనా బతకగలమనే నమ్మకమే వాళ్లను ఇన్నాళ్లూ నడిపించింది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ను నమ్ముకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న తల్లులు వాళ్లు. ఇప్పుడా ఆత్మవిశ్వాసం మీదే దెబ్బపడింది. ఎలాగైనా బతకగలం అనే నమ్మకం సడలిపోతోంది. చేయడానికి పనిలేకుంటే తినడానికి తిండీ ఉండదన్న నిజానికి సాక్ష్యంగా ఇప్పుడు ఆకలిని, ఆశలను ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా నిలబడ్డారు. కరోనా వాళ్ల శరీరాలను తాకకుండానే జీవితాలని దెబ్బతీసింది. శక్తి మేరకు నాలుగు ఇండ్లల్లో ఎంగిలి కంచాలైనా కడిగి.. ఇల్లు గడపాలనుకునే ఎందరో తల్లుల కష్టాలివి. ఇప్పుడా పనీ దొరక్క.. కుండలో గింజలు నిండుకున్నాయి. గుండెల్లో కన్నీళ్లు ఆటుపోటై ఉప్పొంగుతున్నాయి. ఈ కష్టం కరోనా మహమ్మారి తెచ్చిందే.
కరోనా, లాక్ డౌన్ వల్ల ఎంతమంది బతుకులు ఆగమయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులో వాళ్లు, వీళ్లు.. అక్కడ, ఇక్కడ అనే తేడా లేదు. ముఖ్యంగా మహిళల జీవితాల్లో చిమ్మచీకట్లను మిగిల్చాయి. ఒంటరి మహిళలు, వయసు మళ్లిన అవ్వలు, భర్తకు చేదోడువాదోడుగా ఉండాలనుకునే స్త్రీలు. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా డొమెస్టిక్వర్కర్స్గా చాలామంది ఉన్నారు. ఒకరినుంచి మరొకరికి ఇట్టే వ్యాపిస్తున్న కరోనా వైరస్ కారణంగా.. చాలామంది తమ ఉపాధిని కోల్పోయారు. అందులో ఎన్నో ఏళ్లుగా ఇళ్లలో పనినే నమ్ముకున్న లక్షలాది మంది మహిళలు.. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి కారణంగా వీధినపడ్డారు.
ఇంట్లో పనికి రావొద్దని..
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. అందులో ఎక్కువగా మగవాళ్లు రోజువారీ కూలీకి వెళ్తుంటారు. అలాగే కొందరు రూ.ఎనిమిది, రూ.పదివేల జీతం తీసుకుంటూ కంపెనీల్లో పనిచేస్తారు. వాళ్లకు వచ్చే ఆదాయంతో ఇలాంటి మహానగరాల్లో ఇంటి కిరాయి కట్టి, ఖర్చులు వెల్లదీయాలంటే కష్టం. అందువల్ల భార్యలు అధికశాతం ఇళ్లలో పనిచేస్తుంటారు. నాలుగు ఇళ్లలో పనిచేస్తే వచ్చే డబ్బులను భర్త ఆదాయానికి కలిపితేనే.. ఆ కుటుంబం మూడుపూటలా కడుపు నింపుకోగలుగుతుంది. అయితే కరోనా వైరస్వ్యాప్తి భయంతో చాలామంది తమ ఇంట్లోని పనిమనుషులను రావద్దని చెప్పేశారు. లాక్డౌన్ సడలించాక.. అతితక్కువ కుటుంబాలు మాత్రమే.. అది కూడా వివిధరకాల కండీషన్లు పెట్టి పనిమనిషిని ఇంట్లోకి రానిస్తున్నారు.
ఆధారం కోల్పోయినట్లే..
ఒకటి కాదు. .రెండు కాదు.. పది, ఇరవై ఏళ్లుగా ఇళ్లలో పనినే నమ్ముకున్న ఆడవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఈ డొమెస్టిక్మెయిడ్స్లో 30శాతం మంది ఒంటరి మహిళలే ఉన్నట్లు డొమెస్టిక్వర్కర్స్మూమెంట్ ఫౌండర్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లిస్సీ జోసెఫ్ చెప్పారు. ‘ముఖ్యంగా ఇళ్లలో పని చేసేవాళ్లలో చాలామంది యాభై, అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు ఉంటారు. వాళ్లకు ఈ పని తప్ప వేరే ఆప్షన్లేదు. ఇప్పుడు కరోనా భయంతో పెద్ద వయసువాళ్లను అసలు ఎవరూ తమ ఇంటి దరిదాపుల్లోకే రానివ్వట్లేదు. అలా డొమెస్టిక్వర్కర్స్లో దాదాపు అరవై, డెబ్భైశాతం మంది ఈ కరోనా వల్ల ఉపాధి కోల్పోయారు. పల్లెటూళ్ల నుంచి ఇక్కడికి వచ్చినవాళ్లలో చాలామందికి ఇక్కడ రేషన్ కార్డులు కూడా లేకపోవడంతో యూనియన్, వలంటరీల సాయంతో అందిన సరుకులతో పూట గడుపుకున్నారు. పసిపిల్లలు ఉన్న ఒంటరి మహిళలు చేయడానికి పనిలేక, చేతిలో డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం అందించిన రూ.1500 కూడా చాలామందికి అందలేదు’ అని చెప్పారామె.
ప్రభుత్వం నుంచి మొండిచేయి
సాధారణంగా ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్లకు చదువు ఉండదు, లేదంటే చాలా తక్కువ. కనీసం వాళ్ల కష్టాలని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది డొమెస్టిక్ వర్కర్ల ఆవేదనని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్‌సభ్యులు. ఈ యూనియన్‌లో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి పరిధి నుంచే సుమారు లక్షా అరవై వేలమంది డొమెస్టిక్ వర్కర్స్రిజిస్టరై ఉన్నారు. కరోనా కాలంలో పనిలేక రోడ్డునపడ్డ డొమెస్టిక్వర్కర్స్కు రూ.పదివేల ఆర్థిక సహాయం, రేషన్ కార్డు లేనివాళ్లకు సరిపడా రేషన్, ఆరోగ్య సమస్యలకు ఈఎస్ఐ వంటి డిమాండ్లను యూనియన్ప్రభుత్వం ముందు పెట్టింది. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కానీ సమాచారం కానీ అందలేదని యూనియన్‌సభ్యులు చెబుతున్నారు. కనీసం ఆ సమాచారం ఎలా తెలుసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్లంతా.
అలవాటైన పని దూరమైంది
మహబూబ్‌నగర్‌కు చెందిన కవిత దంపతులు పొట్టకూటి కోసం ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌కి వలస వచ్చారు. భర్త శ్రీశైలం సిమెంట్బస్తాల గోదామ్‌లో వాచ్‌మెన్‌గా చేస్తూ నెలకు రూ.పదివేల దాకా సంపాదించేవాడు. ఇద్దరు పిల్లలున్న ఆ కుటుంబానికి అవి చాలేవికావు. అందువల్ల భార్య కవిత ఆరు ఇళ్లలో పని చేసి ఏడు వేలు సంపాదించేది. ఇలా చెరో పని చేసుకుని బాగానే ఉండేవాళ్లు. కానీ ఎప్పుడైతే కరోనా వ్యాప్తి పెరిగిందో.. ఆ కుటుంబ కష్టాలు పెరిగాయి. సిమెంట్ కంపెనీకి ఆర్డర్లు లేకపోవడంతో ఉద్యోగం పోయింది. ఇటు కవితను కూడా పనికి రావద్దని ఆయా యజమానులు చెప్పేశారు. మూడు, నాలుగు నెలలు సొంతూరుకు వెళ్లి అదోఇదో తిన్నారు. ఇలా అయితే లాభం లేదనుకుని, మళ్లీ హైదరాబాద్‌కి వచ్చిన శ్రీశైలం తోపుడు బండి మీద పండ్లు అమ్మడం మొదలుపెట్టాడు. పదిహేను రోజుల వ్యవధిలోనే అతనికి చిన్న యాక్సిడెంట్‌అయి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఇల్లు గడవాలంటే ఎవరోఒకరు పనికి పోవాల్సిందే. మరి అలవాటైన ఇళ్లలో పని లేదు.. ఏం చేయలేని స్థితిలో ఆ రోజు నుంచే తోపుడు బండితో బతుకు పోరాటం మొదలుపెట్టింది కవిత.
ఇల్లు గడవడం కష్టమైంది
‘మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఇరవయ్యేండ్ల కిందటే నా భర్త, నేను హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌కి వచ్చినం. అప్పట్నించి నా భర్త డ్రైవింగ్పనికి పోతే, నేను ఇండ్లల్ల పనికి పోయేదాన్ని. ఏడేండ్ల కిందట గుండెనొప్పి వచ్చి ఆయన చచ్చిపోయిండు. దాంతో ఇద్దరు పిల్లలను సాకడం కోసం కొత్తగా మరో రెండు ఇళ్లలో పనికి పోయేదాన్ని. మార్చి నెల వరకు ఐదు ఇండ్లల్ల చేస్తే.. నెలకు తొమ్మిది వేలు వచ్చేవి. లాక్డౌన్ తర్వాత పోయిన నెల నుంచి ఒక ఇంట్లోల్లు మాత్రం రమ్మన్నరు. కానీ వాళ్లింట్ల చేస్తే మళ్లెక్కడా చెయ్యొద్దని చెప్పిర్రు. దాంతో నెలకు రెండువేలు మాత్రమే వస్తున్నాయి. అందులో ఇంటి కిరాయికే పదిహేను వందలు పోతున్నయి. కరోనా ఏమోగానీ మా బతుకులు ఆగమైనయ్’ అని కన్నీరు పెట్టుకంటూ చెప్పింది సుగుణ.
పక్కనోళ్లు వద్దన్నా రానిస్తున్నాం..
పదేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివాసముంటోంది దేవి కుటుంబం. దానివల్ల వంట పని, ఇంటిపనికి ఒక మనిషిని పెట్టుకున్నారు. లాక్డౌన్లో రెండు నెలలు పని మనిషిని రావద్దని చెప్పారు. తర్వాత పిలుద్దామని ఆ కుటుంబం డిసైడ్అయినా, అపార్ట్మెంట్లోని తోటి ఫ్లాట్‌వాళ్లు నిరాకరించారు. పది రోజులు వాళ్లతో పోరాడి మరీ పని మనిషిని రానిచ్చారు. కాకపోతే వంట పని కాకుండా మిగిలిన పనులను చేయించుకుంటున్నారు. ‘‘మేమెప్పుడూ తనని బయటి మనిషిలా చూడలేదు. కాకపోతే కరోనా భయంతో కొన్నిరోజులు రావద్దన్నాం. కానీ తర్వాత ఆమెకొచ్చే రెండు వేలు కూడా లేకుంటే కష్టమవుతుందని ఆలోచించాం. ఇప్పుడు తను మా ఒక్క ఇంట్లోనే పని చేస్తోంది కాబట్టి ఇరవై ఐదొందలు ఇస్తున్నాం. మొదట్లో మా పక్కింటి ఫ్లాట్‌వాళ్లు చాలా గొడవ చేశారు. కాకపోతే ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఇప్పుడు కాస్త సెట్ అయ్యింది’ అని తెలిపింది దేవి.
కరువు కాలంలోకి నెట్టిన కరోనా
– కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఉన్నట్టుండి ప్రకటించడంతో చాలామందికి పని చేసిన నెల జీతం కూడా అందలేదు. తర్వాత వెళ్లి అడగడానికి కూడా కొంతమంది సొంతూళ్లకు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు. అలా ఎంతోమంది జీతాలు అందక అవస్థలు పడ్డారు. చాలా తక్కువమందికి మాత్రమే జీతం అందింది.
– అప్పటివరకూ చేస్తున్న పనికి రావద్దనడంతో.. ఇల్లు గడవడం ఎలా? ఇంటి కిరాయి ఎలా కట్టాలి? అన్న ఆలోచనలతో మానసికంగా ఎంతోమంది మహిళలు కుంగిపోయారు. ఇళ్లలో పనిలేక కుటుంబ పోషణ కోసం కూరగాయలు, పండ్లు, పూలు, మాస్కులు అమ్మడం వంటి ప్రత్యామ్నాయ పనులను వెతుక్కుంటున్నారు.
– ఇళ్లలో పనికి తక్కువ జీతం వస్తుంది కాబట్టి అందరూ నాలుగైదు ఇళ్లలో పని చేస్తుంటారు. అయితే ఇప్పుడు కరోనా భయంతో.. ‘చేస్తే మా ఒక్క ఇంట్లోనే చేయాలి.. వేరే దగ్గరి చేసి మా ఇంటికి రావద్దు’ అని కండీషన్ పెట్టారు పనిచ్చే యజమానులు.
– ముఖ్యంగా యాభై ఏళ్లు దాటిన మహిళలకు కరోనా వస్తే ప్రమాదమని ప్రభుత్వాలు, డాక్టర్లు చెప్తుండటంతో.. ఆ వయసు వాళ్లతో రిస్క్ తీసుకోలేక వాళ్లను పనిలోకి తీసుకోవట్లేదు.
– కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. దాంతో మహిళలు ఇంట్లోనే ఉండటం వల్ల, ఖర్చు తగ్గించుకోవడానికి ఆఫీస్ పనితో పాటు ఇంటిపనినీ వాళ్లే చేస్తున్నారు. అందువల్ల కూడా చాలామంది పని మనుషులు ఉపాధి కోల్పోయారు.
– పని మనుషుల విషయంలో వివిక్ష కూడా ఈమధ్య బాగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్‌లో ఎవరైనా పనికి వస్తే.. వాళ్లు లిఫ్ట్ వాడొద్దని.. స్టెయిర్‌కేస్ రీలింగ్, గేట్లను ముట్టుకోవద్దని రూల్స్ పెట్టారు.
– కొన్ని కేసుల్లో కరోనా వచ్చి తగ్గిపోయిన మహిళలను ఇళ్లలో పనికి రానివద్దని కూడా కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు సర్క్యూలర్ జారీ చేశాయి.
– అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు పని ఇవ్వడానికి ఒప్పుకుంటున్నా, ఎన్ఓసీ సర్టిఫికేట్, కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్, ఎంప్లాయి ఐడీ వంటివి అడుగుతుండటంతో కూడా చాలామంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
:: ఎన్ఎన్
- September 30, 2020
- Archive
- Top News
- ఆమె
- CAROONA
- DIGNITY OF LABOUR
- DOMESTICLABOUR
- TELANGANA
- కరోనా
- డిగ్నిటీ ఆఫ్ లేబర్
- డొమెస్టిక్వర్కర్స్
- తెలంగాణ
- లాక్డౌన్
- Comments Off on కరోనా తెచ్చిన ఆకలి కేకలు