సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీఎస్పీ 2వ బెటాలియన్ గెస్ట్‌హౌస్‌లో కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీ రవిపట్టన్ షెట్టి, రాంసుందర్ రెడ్డి, నగరపాక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, ట్రైనీ కలెక్టర్ నిధిమీనా, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యకూడళ్లలో హోర్డింగులు, వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జాగ్రత్తలు రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లో మెడికల్‌కాలేజీ నిర్మాణానికి అవసరమైన స్థలాల వివరాలను ఆరాతీశారు. కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలను మంత్రులకు వివరిస్తూ.. ప్రతి రోజుకు మూడువేల టెస్టులు చేస్తున్న నేపథ్యంలో అధికంగా పాజిటివ్ కేసు నమోదవుతున్నాయని తెలిపారు. అంతకుముందు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.