- మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తప్పనిసరి
- అధికారులతో సమీక్షించిన సీఎస్ సోమేశ్‌కుమార్
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు పెండింగ్ విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్నిపంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతినెలా తప్పనిసరిగా కరెంట్ బిల్లులు చెల్లించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బకాయి బిల్లులపై వారంలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల్లో పేరుకుపోయిన పెండింగ్ విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
కరెంట్ మీటర్ రీడింగ్ ప్రాతిపదికనే చార్జీలు వసూలు చేయాలని, నూటికి నూరుశాతం సమగ్ర వివరాలు ఉండాలని సీఎస్ ఆదేశించారు. అవసరమైన చోట నెలరోజుల్లోగా విద్యుత్ మీటర్లను బిగించాలని సూచించారు. సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, డిస్కం సీఎండీలు రఘుమారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.