Breaking News

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్ ​ఇకలేరు

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్​ఇకలేరు
  • ​అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత
  • నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం
  • సీఎం కేసీఆర్​ సంతాపం

సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్‌ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేష్​ మెట్రిక్యులేషన్ వరకు చదివి బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రైవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాటం సాగించారు. ఆ తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరి సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మికనేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సీపీఐ శాసన సభాపక్ష నాయకుడిగానూ వ్యవహరించారు.
మగ్ధుంభవన్​కు పార్థివదేహం
కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్‌ పార్థివదేహాన్ని హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కేంద్ర కార్యాలయం మగ్ధుంభవన్‌ కు తరలించనున్నారు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం అక్కడ గంటపాటు ఉంచి అనంతరం బెల్లంపల్లిలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీపీఐ నేత గుండా మృతిపట్ల సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్​నాయకులు సంతాపం తెలిపారు. మల్లేష్​ నిబద్ధత గల కమ్యూనిస్టు నేత అని, సామాన్య ప్రజల కోసం అంకితభావంతో పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు.

సీఎం కేసీఆర్​ సంతాపం

సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్​ మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేష్​తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మల్లేష్​ కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.