- రిసోర్సెస్ డిపార్టుమెంట్ గా మార్పు
- ఈఎన్సీలకు కీలక బాధ్యతలు
- విస్తృతస్థాయి సమావేశం సీఎం కేసీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతోందని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలని, వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవని స్పష్టంచేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నారు. అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. నీటిపారుదల శాఖను ఇక నుంచి జలవనరుల శాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్టుమెంట్)గా మారుస్తున్నట్లు ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచించారు. ముసాయిదాకు కొన్ని మార్పులు చెప్పారు. అధికారులు మరోసారి వర్క్ షాపు నిర్వహించుకుని సూచించిన మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎంతో వ్యయం, ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, అందుకు తగ్గట్టుగా జల వనరుల శాఖ సంసిద్ధం కావాలని సీఎం కేసీఆర్ సూచించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇన్చార్జ్గా నియమించాలి. ఈఈలు, డీఈల పరిధులను ఖరారు చేయాలి. సీఈ ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్ డ్యాములు సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి.సీఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయో కచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున, సీఈ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కావాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి.
– పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంతమంది ఈఎన్సీలు ఉండాలనే విషయమై నిర్ధారించాలి. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్, ఈఎన్సీ ఆపరేషన్స్ కూడా కచ్చితంగా ఉండాలి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఇలా ప్రతిచోటా కచ్చితంగా ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలి. దానికి అనుగుణంగానే నిర్వహణ జరగాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలి.
-అన్ని పంప్ హౌస్ల నిర్వహణ బాధ్యత విద్యుత్ శాఖకు అప్పగించాలి
-నరేగా ద్వారా సాగునీటి రంగంలో ఏయే పనులు చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
-ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్టు హౌస్లు నిర్మించాలి. సీఈలకు తమ పరిధిలో క్యాంపు ఆఫీసులు నిర్మించాలి. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాసగౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీలు మురళీధర్ రావు, నాగేందర్ రావు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, హరేరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు.