ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారా.. ఆయనకు సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెగ తగిలిందా..? పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి ఉన్న విషయం జగన్ తెలుసుకున్నారా..?. ఇటీవల పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం జగన్ ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిద్దరు ఎంపీలకు తప్ప ఎవరికీ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, తాను అనేకసార్లు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదని, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు దీనిపై చాలా అసంతృప్తితో ఉన్నారని బాహాటంగానే వ్యాఖ్యానించారు. దీంతో తాను కలవకపోతే ఆ ఎంపీ బాటలో మరికొంతమంది ఉంటారని భావించిన సీఎం ఇప్పుడు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు సమయం ఇచ్చి మాట్లాడేందుకు నిర్ణయించుకున్నారట.
ఎంపీ రఘురామ కృష్ణంరాజులా మరింత మంది మారకముందే తానే మారితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు ఇప్పుడు జగన్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటున్నారని, ఎమ్మెల్యే, ఎంపీలకు అపాయింట్‌మెంట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వారితో నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులు, ఎన్నికల హామీలు, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చిస్తున్నారట. మంగళవారం జగన్ 8మంది ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇచ్చి మాట్లాడారట. రానున్న రోజుల్లో మిగతా వారందరితో కూడా జగన్ భేటీ కావాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.