అతి తక్కువ టైమ్‌లోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ (షామ్నా ఖాసిమ్). అయితే ఈ కేరళ ముద్దుగుమ్మ రీసెంట్గా ఓ ఫ్రాడ్ గ్యాంగ్ ట్రాప్‌లో ఇరుక్కుంది. సినిమాల్లో బాగా గ్యాప్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్సయింది. పెళ్లి సంబంధం వచ్చింది. ఇరువర్గాలూ మాట్లేడుసుకున్నారు కూడా. ఇక పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారట. అయితే ఇంతలో పూర్ణకి ‘మాకు డబ్బులివ్వు.. లేదా నీ వీడియోలు నెట్లో షేర్ చేస్తాం..’ అంటూ బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయంట. ముందు పూర్ణ భయంతో వణికినా వాళ్లమ్మ సపోర్ట్ తో వాళ్లపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చేసింది. దాంతో అసలు విషయాలు బయటకు రావడం మొదలయ్యాయట. పెళ్లిచూపుల్లో తనకు ఇచ్చిన ఫొటో వేరని.. తాను ఫోన్లో మాట్లాడే పెళ్లి కొడుకు వేరని పోలీసు దర్యాప్తులో తేలడంతో పూర్ణ ఆశ్చర్యపోయింది. ఇంకా పోలీసుల దర్యాప్తులో పెళ్లిచూపులకు వచ్చినవాళ్లే బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిడయమే కాదు.. వాళ్ల వెనక ఓ పెద్ద ముఠా కూడా ఉందని తేలిందట. ఇంకా ఆ ముఠా ట్రాప్‌లో ఎంతోమంది మోడలింగ్ చేసే అమ్మాయిలు కూడా ఇరుక్కున్నట్టు గుర్తించారట పోలీసులు. కానీ ఆ అమ్మాయిలెవరూ భయంతో తమకు జరిగిన అన్యాయానికి స్టేషన్ గడప వరకూ రాని కారణంగా ఈ విషయాలన్నీ మరుగునే ఉండిపోయాయి. ఈ విషయాలు విన్న పూర్ణ మనసు రగిలిపోయింది.
‘ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి.. ఇంకొకరు అయితే ఇలా జరిగినందుకు భయపడిపోయేవారేమో.. నా ఫ్యామిలీ నా వైపు బలంగా నిలబడ్డమే కాదు పెద్ద పెద్ద పోలీసాఫీసర్లు కూడా మాకు సపోర్ట్ చేశారు. వాళ్లపై కేసు పెట్టేటప్పుడు వాళ్లకి తగిన శిక్ష పడితే బాగుండు అనుకున్నానంతే. కానీ ఇంత పెద్ద రాకెట్బయటపడుతుంది అనుకోలేదు. దీనివల్ల అన్యాయం జరిగిన అమ్మాయిలందరికీ కూడా న్యాయం జరిగింది. నిజానికి నాకు జరిగిన అన్యాయం వారికి జరిగిన దానికంటే చాలా చిన్నది. నా కారణంగా వాళ్లకు బుద్ధి చెప్పడానికేమో ఈ దారి దొరికిందనుకుంటున్నా.. కానీ పెళ్లి ఇప్పుడిప్పుడే చేసుకోను.. ఎందుకంటే ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో నాకిప్పుడు అర్థం కావడం లేదు..’ అంటోంది పూర్ణ. ప్రస్తుతం పూర్ణ తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది.