- తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మార్క్సిస్టు దృక్పథంతో ప్రజాసమస్యలపై పాలకులను నిలదీసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య(64) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నోముల 30ఏళ్లకు పైగా రాజకీయ, ప్రజాజీవితంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 1987లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(మార్క్సిస్టు) నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికై శాసనసభపక్ష నాయకుడిగా ప్రజాసమస్యలపై గొంతెత్తి నినదించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి కె.జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడిగా ఎందరికో తనవంతు సేవలు అందించారు. నోముల మృతిపట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. నాగార్జునసాగర్ ప్రజానీకానికి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. నోముల భౌతికకాయాన్ని మంత్రి టి.హరీశ్‌రావు అపోలో ఆస్పత్రిలో సందర్శించి కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పారు.