అమరావతి: పార్టీ ఏదైతేనేం తమ పట్టు నిలుపుకోవాలనుకునే వారు ఆ నేతలు. అధికారం తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. పట్టు సాధించడం కోసం ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టాలోనని నిత్యం ఆలోచిస్తుంటారు. వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా అదే పరిస్థితి. ఒకే పార్టీలో ఉన్నా అదే పరిస్థితి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరివీ భిన్నధృవాలు. పోటాపోటీగా బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకుందామని సవాల్ విసురుకునేవారు. అటువంటిది ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే వలస నేతలు. అయినా ఎవరి పట్టు వారు నిలుపుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇద్దరి మధ్య ప్రభుత్వ అధికారులు గుల్లవుతున్నారట.ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల రాజకీయాలే వేడెక్కాయి. మొన్నటి వరకూ టీడీపీలో కీలకంగా వ్యవహరించిన కరణం బలరాం ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలా అనేకంటే.. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశారు.
2024 నాటికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న జగన్.. ఈ దఫా కమ్మ సామాజికవర్గంలో బలమైన నేతల చుట్టూ వల విసిరారు. టీడీపీ ఆయువు పట్టుగా భావించే వారిని ఆ పార్టీకి దూరం చేయాలనే పథక రచనకు రూపమిస్తున్నారు. మొన్న వల్లభనేని వంశీ.. నిన్న దేవినేని అవినాష్.. ఇప్పుడు కరణం బలరాం.. రేపు ఎవరంటే.. ప్రత్తిపాటి పేరు వినిపిస్తుందనుకోండి. కొద్దిసేపు వాటిని పక్కనబెడితే.. చీరాల రాజకీయంగా ఎప్పుడూ హాట్‌గా ఉంటుంది. 2014లో వైఎస్సార్సీపీ తరపున పోటీచేసి గెలిచిన అమంచి కృష్ణమోహన్ తర్వాత టీడీపీలో చేరారు.
2019 ఎన్నికల ముందు మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చారు. కానీ.. ఆ ఎన్నికల్లో కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అమంచి చేష్టలు, ఆయన అనుచరుల దందా ఇవన్నీ కూడా ఓటమికి కారణాలనే గుసగుసలూ లేకపోలేదు. అటువంటి చోట ఇప్పుడు కరణం వైఎస్సార్సీపీలో యాక్టివ్ కావడంతో అమంచికి బ్రేకులు పడ్డాయట. అధికారులకు కూడా ఎవరి మాట వినాలనేది అర్థంకాకుండా ఉందట. కరవమంటే కప్పకు వదలమంటే పాముకు కోపం అనేంతగా ఉందట వారి పరిస్థితి. మరి దీనికి మధ్యేమార్గం ఏమిటనేది సర్కారు పెద్దలు తేల్చాల్సిందే అంటున్నారు బలరామకృష్ణుల అనుచరగణం.