Breaking News

ఊరులోనే కరోనా టెస్టులు

ఊరులోనే కరోనా టెస్టులు
  • సంచార సంజీవని వాహనాన్ని ప్రారంభించిన కర్నూలు డీఆర్వో పుల్లయ్య

సారథి న్యూస్​, కర్నూలు: జిల్లాలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన సంచార సంజీవని(ప్రత్యేక బస్సు) సేవలను విస్తృతం చేయాలని కర్నూలు డీఆర్వో పుల్లయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించేందుకు సిద్ధం చేశామన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్​ ప్రాంగణంలో కరోనా వైరస్​ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాటుచేసిన సంచార సంజీవని ప్రత్యేక వాహనాన్ని కలెక్టర్​ జి.వీరపాండియన్​ ఆదేశాల మేరకు డీఆర్వో పుల్లయ్య, ఆర్టీసీ రీజినల్​ మేనేజర్​ వెంకట్రాములు శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వాహనం ద్వారా జిల్లాలోని మూడు డివిజన్లలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు తెలిపారు. ఒక్కో బస్సులో పదిమంది ఒకేసారి మెడికల్​ టెస్టు చేయించుకునేలా ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. కరోనాపై పోరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ముందడుగు వేసి రాష్ట్రంలోని ఇంద్రబస్సులను కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మారుస్తూ రాష్ట్ర వైద్యోగ్యశాఖ, ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుని వాటికి సంజీవని అనే నామకరణం చేసిందన్నారు. అనంతరం కలెక్టరేట్​లోని సిబ్బంది, పలువురు ఉద్యోగులు, స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో శాంపుల్ కలెక్షన్ నోడల్ అధికారి డాక్టర్ విశ్వేశ్వరయ్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.