సారథి న్యూస్, రామాయంపేట: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు స్మార్ట్ ఫోన్లలో రైతుల కోసం పలు రకాల యాప్ లను రూపొందించారు. గ్రామాల్లోని రైతులు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లకుండా ఉన్న చోటునుంచే అరచేతిలో సాగు మెళకువలను తెలుసుకోవడానికి ఈ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి.
సులభంగా సేవలు
ఈ సాగులో పాటించాల్సిన మెళకువలు, ఎరువులు, విత్తనాలు, చీడపీడల నివారణ వంటి అనేక విషయాలు ఉన్నాయి. రైతులకు అర్థమయ్యే రీతిలో తెలుగులో నే ఈ యాప్‌లను రూపొందించారు. కొత్త వంగడాలు, వ్యవసాయ పరికరాలు, పంట దిగుబడులు, మార్కెటింగ్, పాడి పశువుల పోషణ, ఆక్వా,కోళ్ల పెంపకం తదితర వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ యాప్ లలో పొందుపరిచారు.
ఆ యాప్ లు ఇవే
ప్రస్తుతం తెలుగులో కృషి విజ్ఞాన్, నా పంట, వ్యవసాయం, అగ్రియాప్, అన్నదాత యాప్, కిసాన్ సువిధ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లలో ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో వ్యవసాయం లో మేలైన యాజమాన్య పద్ధతులు, పంటల బీమా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు వివరాలను తెలియజేస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుల మందు వినియోగంపై లాభ నష్టాలను, సేంద్రియ సాగులో రైతులకు కలిగే లాభాలను వివరిస్తున్నాయు.
టెక్నాలజీ ని సద్వినియోగం చేసుకోవాలి
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. పంట సాగు నుంచి మొదలు మార్కెటింగ్ వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు యాప్‌లలో పొందుపరుస్తారు. స్మార్ట్ ఫోన్లు వాడే వినియోగదారులు ఎప్పటికప్పడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీటి ద్వారా రైతులకు సమయం ఆదా అవుతుంది. పంటల బీమా తదితర వివరాలు తెలుస్తాయి.
సతీశ్, నిజాంపేట మండల వ్యవసాయ అధికారి.