Breaking News

ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

సారథి న్యూస్​, మహేశ్వరం: అర్హత కలిగి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రూ.1.30 కోట్ల వ్యయంతో నాగారం, మన్సాన్‌పల్లి, మన్సాన్‌పల్లి చౌరస్తా, పెండ్యాల, దుబ్బచర్ల, దిల్‌వార్‌గూడ గ్రామాల్లో రైతు వేదికలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్​ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లు లేని వారికి ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇళ్లు కట్టించి ఇస్తుందన్నారు. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం రూ.ఐదు లక్షల సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయమై గత బడ్జెట్‌ సమావేశంలో చర్చించి నిధులు మంజూరు చేయాలని తీర్మానం చేసినా కరోనా కారణంగా నిలిచిపోయిందన్నారు. ఈ బడ్జెట్‌ సమావేశంలో నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు నిర్మించిన ఘనత సీఎం కె.చంద్రశేఖర్ రావుకే దక్కిందన్నారు. మహేశ్వరం మండలంలో రైతుబంధు కింద 1,04,900 మంది రైతులకు రూ.4.5 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు.

రైతు వేదికను ప్రారంభిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ తీగల అనితారెడ్డి