Breaking News

ఇది కీలక సమయం

ఇది కీలక సమయం
  • ఆర్థిక వ్యవస్థను ప్రారంభించుకుందాం
  • ఇది కీలకమైన సమయం జాగ్రత్తగా ఉందాం
  • కరోనా నివారణలో అద్భుతంగా పనిచేశారు
  • ప్రజల్లో మరింత చైతన్యం కలిగించండి
  • కలెక్టర్, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్

సారథి న్యూస్, అనంతపురం: ‘నేను ప్రతిసారీ చెబుతన్నా.. నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారీగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెబుతున్నా.. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పనిచేస్తే.. ప్రభుత్వం బాగా పాలన చేసినట్టే’ అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కరోనా వైరస్‌ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో గ్రామవలంటీర్, సచివాలయం, ఆశావర్కర్లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులంతా అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.‘మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌ డౌన్‌లోకి అడుగుపెట్టాం. ఇంతకుముందు మనం అనుసరించిన పద్ధతి వేరు. నాలుగో విడత లాక్‌ డౌన్​లో అనుసరిస్తున్న పద్ధతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. కోవిడ్‌–19 నివారణపై మన దృష్టి పోకుండానే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలి
‘ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలి. కలెక్టర్లు, ఎస్పీలు అందులో భాగస్వాములు కావాలి. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉంది. చిన్న చిన్న షాపుల నుంచి ప్రతీది ఓపెన్‌ చేయాలి. రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజారవాణా ప్రారంభమవుతుంది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్​ నడుస్తాయి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. మనం కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది. వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలి.’ అని సీఎం జగన్​ సూచించారు.

ప్రజలు ముందుకు రావాలి
‘ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వైద్యపరీక్షలు చేయించుకునేలా చూడాలి. వైద్యపరీక్షలకు ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలన్నది ఎడ్యుకేట్‌ చేయాలి. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను ప్రారంభిస్తున్నాం. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలి. కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలి. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలి’ అని సీఎం వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి కోరారు.