- జూన్ 1వ తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో రాజధాని నగరంలో నిలిచిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ తర్వాత నుంచి మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించగా, గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతుండడంతో సిటీ బస్సులు, మెట్రో సర్వీసులను మాత్రం నిలిపివేసింది.
దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం హైదరాబాద్ లోని 32 మార్గాల్లో సిటీ బస్ సర్వీసుల సదుపాయాన్ని కలిగిస్తూ అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో సేవలను కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రైళ్లలో కోవిడ్–19 మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శానిటైజేషన్, మాస్క్లు కట్టుకోవడం తప్పనిసరిచేయనున్నారు.