న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే 22,771 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ శనివారం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. దీంతో కేసుల సంఖ్య 6,48,315కు చేరింది. ఒక్క రోజులో 442 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 3,94,227 మంది కోలుకోగా.. 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
శుక్రవారం ఒక్కరోజే 14వేల మంది కోలుకున్నారని అధికారులు చెప్పారు. మన దేశంలో రికవరీ రేట్ 60 శాతం దాటిందని ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 1,92,990 కరోనా కేసులు ఉన్నాయి. వ్యాధి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 8,376కి చేరింది. లక్ష కేసులు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,02,721 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 94,695కి చేరింది. కాగా.. కేసుల సంఖ్య ఇలానే పెరిగినట్లైతే ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న రష్యాను కూడా దాటివేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రష్యాలో ప్రస్తుతం 6.66 లక్షల కరోనా వైరస్ కేసులు ఉండగా.. ఇండియాలో 6.48లక్షలు కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 1.10కోట్లకు చేరింది. వ్యాధి బారిన పడి 5.24లక్షల మంది చనిపోయారు. వాటిలో యూఎస్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి.