సారథిన్యూస్, హైదరాబాద్: దేశంలో కరోనాకేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 10వేల కొత్తకేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులతో దవాఖానలు నిండిపోతున్నాయి. వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్సనందించడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ ‘క్లినికల్ గైడెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ కరోనా’పేరిట నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వ్యాధి తీవ్రతను బట్టి కరోనారోగులను విభజించి.. తీవ్రత తక్కువగా ఉన్న రోగులకు ఇంట్లోనే వైద్యం అందించవచ్చని సూచించింది.
మూడువర్గాలుగా కరోనా రోగులు
కరోనా రోగులను వ్యాధి తీవ్రతను బట్టి మూడు వర్గాలుగా విభజించారు. సల్ప లక్షణాలు ఉన్నరోగులు, మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులు, తీవ్రలక్షణాలు ఉన్న రోగులుగా వారిని విభజించారు. స్వల్ప లక్షణాలు ఉన్న ఇంట్లోనే క్వారంటైన్ చేసి చికిత్సనందించనున్నారు. మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్నవారిని దవాఖానాల్లో ఉంచి చికిత్స అందించనున్నారు.
48 శాతం మందిలో జ్వరం, దగ్గు
కరోనా వైరస్ సోకిన 48శాతం మందిలో జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. 15,366 మంది దరఖాస్తులను పరిశీలించి విశ్లేషించగా.. అందులో జ్వరం 27%, దగ్గు 21%, గొంతులో గరగర 10%, దమ్ము 8%, బలహీనత 7%, ముక్కు నుంచి నీరు కారడం 3%, ఇతర లక్షణాలున్న వారు 24% మంది ఉన్నట్లు గుర్తించారు.
వాసన, రుచి తెలియకున్నా ప్రమాదమే
వాసన, రుచి గుర్తించలేకపోయినా కరోనా లక్షణాలుగా భావించాలని కేంద్రం సూచించింది.
కరోనా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, దగ్గు, త్వరగా అలసిపోవడం, దమ్ము రావడం, కీళ్లు, కండరాల నొప్పులు, గొంతులో గరగర, ముక్కు నుంచి నీరు కారడం, విరోచనాలు తదితర లక్షణాలుంటాయి. కరోనా వైరస్ సోకిన పిల్లల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపించవని తెలిపింది.
వెంటిలేటర్ చివరి ప్రయత్నం
కరోనా వైరస్ సోకిన రోగికి కృత్రిమ శ్వాస అందించడం చివరి ప్రయత్నంగా ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాతే ఈ పద్ధతి ఎంచుకోవాలని సూచించారు. కృత్రమశ్వాస అందించేముందు రోగి మూత్రపిండాలు, కాలేయం పని తీరు సక్రమంగా ఉందోలేదో పరిశీలించాలని సూచించింది. ఐసీయూలో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే ఎన్-95 మాస్కులు వాడాలని సూచించింది.
కరోనా ఉగ్రరూపం
మరోవైపు దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 11,458 మందికి వైరస్ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల మొత్తం 3,08,993కు చేరాయి. గత 24 గంటల్లో 386 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 8,884కు చేరింది. 1,54,329 మంది (49.9 శాతం) వ్యాధి నుంచి కోలుకోగా, 1,45,779 మంది చికిత్స పొందుతున్నారు.