Breaking News

ఇంటి నుంచే పనిచేస్తం

ఇంటి నుంచే పనిచేస్తం

  • కరోనా నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లేందుకు టీచర్ల భయం
  • రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు పాజిటివ్​

హైదరాబాద్: తమకు కూడా ఇంటి నుంచే పని చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉపాధాయులు డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారంతా విధుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచినప్పటికీ పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీచర్లంతా ‘డోర్ టు డోర్ సర్వే’లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఉపాధ్యాయులు కోవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో ఇది ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) తెలిపిన లెక్కల ప్రకారం.. సిద్దిపేటలో 120 మంది, జగిత్యాలలో 90 మంది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43, కరీంనగర్ లో 38 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక వరంగల్ 36 మంది, మెదక్ 35, హైదరాబాద్ ౩౦, సంగారెడ్డి జిల్లాలో 29 మంది టీచర్లకు వైరస్ ప్రబలినట్లు చెబుతున్నారు. వైరస్ విజృంభణ కారణంగా బయటకు అడుగుపెట్టాలంటేనే టీచర్లు వణుకుతున్నారు.
మా జీవితాలతో ఆటలొద్దు
కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే ఎమ్మెల్యేలను అసెంబ్లీకి అనుమతిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాకు కూడా అలంటి నిబంధనలు ఎందుకు పెట్టడం లేదు. మా జీవితాలను ఫణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరితహారం, డోర్ టు డోర్ సర్వేలు, కోవిడ్ లక్షణాలు ఉన్నవారితో కలిసి పని చేయడం వల్ల చాలామంది దీని బారిన పడుతున్నారు. మాకు కూడా ఇంటి నుంచే పనిచేసే సౌకర్యాన్ని కల్పించాలి.
:: బ్రహ్మచారి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు