Breaking News

ఇంకెంత‌కాలం..?

ఇంకెంత‌కాలం...?
  • మాకు నిర్ణయాధికారం ఇవ్వరా?
  • ఐరాస వీడియోకాన్ఫరెన్స్​లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భార‌త్‌కు ఐక్యరాజ్యస‌మితి భ‌ద్రతామండ‌లిలో నిర్ణయాధికారం నుంచి ఇంకెంత‌కాలం దూరంగా ఉంచుతార‌ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఐరాస సర్వప్రతినిధి స‌భ 75వ వార్షికోత్సవం సంద‌ర్భంగా నిర్వహించిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ఐరాస అనుస‌రిస్తున్న వైఖ‌రిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐరాస‌లో సంస్కరణలు చేయాల‌ని భార‌త్ ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని అన్నారు. అయితే అవి ఎప్పటికీ కార్యరూపం దాల్చుతాయోన‌నీ, వాటికోసం తాము దశాబ్దాలుగా ఎదురుచూస్తూనే ఉన్నామ‌ని చెప్పారు.

సంస్కరణల ప్రక్రియ ఇంకెన్నాళ్లకు పూర్తవుతోందని.. ఐరాస నిర్ణయాధికారం నుంచి భార‌త్‌ను ఎన్నాళ్లు పక్కనబెడతారని ఆయ‌న ప్రశ్నించారు. 1945లో ఐరాస ఏర్పడిన నాటి ప‌రిస్థితులు వేర‌నీ.. ఇప్పుడు పరిస్థితులు వాటికి పూర్తి భిన్నమైనవని తాజా స‌వాళ్లకు అనుగుణంగా యూఎన్‌లోనూ సంస్కరణలు జ‌ర‌గాల‌ని సూచించారు. ప్రపంచమంతా క‌రోనా వైర‌స్‌తో బాధ‌ప‌డుతుంటే.. ఐరాస ఏం చేసింద‌ని ఘాటుగా ప్రశ్నించారు. ప్రపంచ జ‌నాభాలో 18 శాతం ఉన్న భార‌త్‌ను ఇంకెంత‌కాలం నిర్ణయాధికారాల‌ను దూరం ఉంచుతార‌ని నిల‌దీశారు. క‌రోనా వంటి క్లిష్టస‌మయంలోనూ ప్రపంచదేశాల‌కు అవ‌స‌ర‌మైన మందుల‌ను భార‌త్ స‌ర‌ఫ‌రా చేసింద‌నీ, రేపు క‌రోనాకు టీకా వచ్చిన‌ త‌ర్వాత ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేసే దేశం తమ‌దేన‌ని ప్రధాని మోడీ స్పష్టంచేశారు.