చెన్నై: తన కెరీర్ మొత్తంలో 1999లో జరిగిన భారత పర్యటన చాలా ప్రత్యేకమైందని పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. దాదాపు 10ఏళ్ల విరామం తర్వాత, భారత్– పాక్ టెస్ట్ సిరీస్‌లో మ్యాచ్ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ‘ఆ పర్యటనకు నేను కెప్టెన్‌ను. చెన్నైలో తొలి టెస్ట్. పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా.. మేం బాగా ఆడాం. దీంతో మ్యాచ్ గెలిచాం. ఇండో–పాక్ చరిత్రలో ఇదే తొలి విజయం కావడంతో మా ఆనందం రెట్టింపు అయింది. చెన్నై అభిమానులు కూడా లేచి నిలబడి కరతాల ధ్వనులతో స్వాగతం చెప్పారు. ఇవన్నీ మాలో మరింత ఉత్సాహన్ని నింపాయి. అందుకే నా జీవితంలో ఈ పర్యటనను ఎప్పుడూ మర్చిపోలేను’ అని అక్రమ్ పేర్కొన్నాడు.
90వ దశకంలో తాము భారత్‌పై మరిచిపోలేని విజయాలు సాధించినా.. ఇప్పుడు అలాంటి గెలుపులు దక్కడం లేదన్నాడు. ఈ సమయంలో భారత్‌ను ఓడించే శక్తి, సామర్థ్యాలు పాక్ కు లేవని అంగీకరించాడు. ఇక తన కెరీర్ సాఫీగా సాగడానికి సానుకూల దృక్పథమే కారణమని చెప్పాడు. ప్రతి విషయాన్ని తాను చాలా సానుకూలంగా తీసుకుంటానని వెల్లడించాడు. పాక్ తరఫున 104 టెస్టులు, 356 వన్డేలు ఆడిన అక్రమ్.. 916 వికెట్లు పడగొట్టాడు.