- తెరుచుకున్న మద్యం షాపులు
- వైన్స్ వద్ద విపరీతమైన రద్దీ
- కొద్దిసేపటికే స్టాక్ లేక మూత
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు
సారథి న్యూస్, మెదక్: నెలన్నర రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైన్స్ తెరచుకోడంతో మద్యం ప్రియులు షాపుల ఎదుట బారులుదీరారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చుకుని, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పులను వరుసలో పెట్టడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించగా, 23వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు వైన్స్ కూడా మూతపడ్డాయి. 45రోజులుగా మందు దొరక్క మద్యం ప్రియులు నానా హైరానా పడుతున్నారు.
ఎక్సైజ్ అధికారులు అన్ని వైన్స్ కు సీల్ వేసినప్పటికీ మద్యానికి డిమాండ్ ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని చాలా వైన్స్ ఓనర్లు దొంగచాటుగా షాపులు తెరిచి లిక్కర్‌ను రహస్య ప్రదేశాలకు తరలించి ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు. కొన్నిచోట్ల వైన్స్ లో దొంగలుపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో నెలన్నర రోజుల తరువాత బుధవారం వైన్స్ షాపులు తెరుచుకున్నాయి. కాగా అనేకచోట్ల షాపులు తెరవకముందే జనం వైన్స్ ఎదుట క్యూ కట్టారు. మెదక్ జిల్లావ్యాప్తంగా 37 వైన్స్ ఉండగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, పోలీస్ అధికారులు వైన్స్ ల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కాగా, రద్దీ ఎక్కువగా ఉండడంతో పలుచోట్ల జనం గంటల తరబడి లైన్లలో నిలబడి తమకు నచ్చిన బ్రాండ్ మద్యం బాటిళ్లను కొని తీసుకెళ్లారు. కాగా వైన్స్ మళ్లీ ఎక్కడ మూసివేస్తారన్న అనుమానంతో కొందరు నాలుగైదు బాటిళ్లు కొనడం గమనార్హం. అయితే స్టాక్ లేకపోవడంతో చాలా వైన్స్ మధ్యాహ్నం వరకే మూతపడ్డాయి.