Breaking News

ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం

ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం

అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ ​సీఎం వైఎస్‌ జగన్‌మోహన్​రెడ్డి స్పష్టంచేశారు. రూ.ఐదులక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి వర్తింపు చేస్తామన్నారు. గురువారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆస్పత్రులకు గ్రేడింగ్‌ విధానం అమలు చేస్తామన్నారు. 1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని తెలిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత ప్రభుత్వ బకాయిలన్నింటినీ చెల్లించామన్నారు.

తాము అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1059 చికిత్సలు ఉంటే.. ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని వెల్లడించారు. రాష్ట్రంలో 27 టీచింగ్ హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్‌ నివారణ చర్యలపై మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సీఎం వైఎస్‌ జగన్ మోహన్​రెడ్డి సూచించారు. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. కరోనా రాగానే ఏం చేయాలన్న దానిపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని, కలెక్టర్లు స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ లాంటి వాటిని పెట్టుకోవడం వల్ల వ్యాప్తి తగ్గుతుందన్నారు.