సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయమంతా సీఎం కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. కరోనా కాలంలో సీఎం కనిపించడం లేదంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విపక్ష కార్యకర్తలు, నేతలు సీఎం కనిపించడం లేదంటూ పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా పెట్టారు. కేసీఆర్.. తెలంగాణలో రాజకీయం ఏదైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక.. ఏం చేస్తాడనేది కూడా ఆసక్తిగా ఉండేది. ఆయన మాటలు.. చేతలు వింతగా అనిపించినా ఎవరూ నోరెత్తే సాహసం చేయరు. మీడియా కూడా చూసీ చూడనట్టుగా ఉంటుంది. కోరి కొరివితో తలగోక్కోవడం ఎందుకనే భయం కూడా దాగుందనేది వాస్తవం. యాగాలు, కొత్త నిర్మాణాలు, కాళేశ్వరం ఇవన్నీ ఆయనకే చెల్లిందనాలి.
2018 ముందస్తు ఎన్నికల్లో గెలుపుతో 2019 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పాలని కలలుగన్నా ఎక్కడో పథకం బెడసికొట్టింది. అయినా.. సీఎంగా కేసీఆర్ మాటే తెలంగాణలో శాసనం. ఆయన గురించి కొద్దిరోజులుగా విపక్షాలు కొత్త వివాదం లేవనెత్తాయి. 17 రోజులుగా కేసీఆర్ బయటకు రావట్లేదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది. ఎక్కడున్నారు. ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారా! వైద్యుల సలహాతో ఇంట్లోనే ఉంటున్నారా! ఎందుకంటే కొద్దికాలం క్రితం స్వల్ప అనారోగ్యంతో చికిత్స పొందారు. దీంతో కరోనా విస్తరిస్తున్న వేళ జాగ్రత్తగా ఉండి ఉండవచ్చేమో అనేది పార్టీ వర్గాల అంచనా. ఓ యువకుడు ప్రగతి భవన్ వద్ద సీఎం కేసీఆర్ ఎక్కడ.. ఆయన ఎలా ఉన్నారనేది తెలుసుకోవడం తన బాధ్యతంటూ ఫ్లకార్డుతో వీరంగం వేశాడు. అయితే, పోలీసులు వారిని అరెస్ట్ చేశారనుకోండి. తాజాగా కేసీఆర్.. ఓ గ్రామ సర్పంచ్‌తో మాట్లాడిన ఆడియో హల్‌చల్ చేస్తోంది. దీన్నిబట్టి ఆయన బాగానే ఉన్నారనేది పార్టీ వర్గాలు చెప్పకుండానే బయటపెట్టాయి. అయినా.. ఏదో మూలన చిన్న అనుమానం. మరి దాన్ని నివృత్తి చేస్తే విపక్షాలు నోళ్లు మూస్తాయి. అభిమానులకూ ఊరటనిచ్చినట్టవుతుందంటూ గుసగుసలూ లేకపోలేదు సుమా..!