- జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ
- పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీ
- ప్యాపిలిలో గొర్రెల కాపరుల శిక్షణ కేంద్రం
- సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. రెండు గంటలపాటు కొనసాగిన మీటింగ్‌లో పలు కీలకమైన అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు అంశాన్ని చర్చించింది. అందుకోసం జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ కమిటీలో సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలు ఇవే..
వైఎస్సార్ చేయూత పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం, మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చించారు. పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదం చర్చకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020, పెట్టుబడిదారులు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం, అభివృద్ధి, రాష్ట్రం వెలుపలకు ఇంధన ఎగుమతి చేయడం, రాష్ట్ర డిస్కామ్‌ల ద్వారా విద్యుత్ సేకరణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు, రూ.40వేల కోట్ల మూలధన పెట్టుబడితో ప్రత్యేక సంస్థ ఏర్పాటు, కడప జిల్లాల గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు పరిహారం, కడప జిల్లా కొండపురం గ్రామానికి చెందిన ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు రూ.145.94 కోట్ల చెల్లింపు, ఏపీఐఐసీ లిమిటెడ్‌కు రూ.2,000 కోట్ల తాజా టర్మ్ లోన్ తీసుకోవడానికి అనుమతి, నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి, కర్నూలు జిల్లా ప్యాపిలిలో రూ.ఐదుకోట్లతో గొర్రెల కాపరుల శిక్షణ కేంద్రం, ప్యాపిలీ మండలం కొమ్మెమర్రి గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.