తాగుడుకు డబ్బులివ్వలేదని ఓ కొడుకు తల్లిని పీక పిసికి చంపేశాడు.. కాటికి కాలు చాపుకున్న వద్ధురాలైన తల్లిని పట్టెడన్నం పెట్టలేక ఇంటినుంచి వెళ్లగొట్టాడో మహానుభావుడు. ముసలి తల్లికి సేవలు చేయలేక బతికుండగానే శ్మశానంలోనే వదిలి వచ్చాడు మరో ప్రబుద్ధుడు. కన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి తమకు సమయం లేదని వందలాది మంది కొడుకులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఇవి నిత్యకత్యంగా మారాయి. కానీ, ఢిల్లీలోని ఓ కొడుకు మాత్రం ఇలా చేయలేదు. పైగా కన్నతల్లిని కాపాడుకునేందుకు తన ప్రాణాలకు ముప్పు ఉంది తెలిసినా సంతోషంగా ఆ పనిచేస్తూ తల్లిని కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు.
ఢిల్లీకి చెందిన చాంద్ మహ్మద్‌కు మెడిసిన్ చదవాలని కోరిక. అయితే, అతడి కలలను లాక్‌డౌన్ ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. చాంద్ మహ్మద్‌కు తల్లిదండ్రులతో పాటు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు అన్నలు. లాక్‌డౌన్ ప్రభావంతో పెద్దన్నయ్య ఉద్యోగం పోయింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి తీవ్రమైంది. పైగా తల్లి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతోంది. ఇలాంటి పరిస్థితిలో తల్లికి అత్యవసర మందులు కొనడానికి చేతిలో చిల్లిగవ్వ లేని దారుణ పరిస్థితికి చేరింది ఆ కుటుంబం.
దీంతో చాంద్ మహ్మద్ లోక్‌నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో స్వీపర్‌గా చేరాడు. కరోనా డేడ్బాడీస్ను అంబులెన్స్‌లో ఎక్కించడం, శ్మశానవాటికలో దించడమే అతడికి అక్కడ విధులు. అంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ తల్లికి మందులు ఇప్పించేందుకు చాంద్ మహ్మద్ ఈ పనులను సంతోషంగా చేస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ కరోనా నుంచి కాపాడుకోవచ్చు కానీ.. ఆకలి నుంచి తప్పించుకోలేం గదా..! అన్నాడు. అప్పుకోసం ఎన్నిచోట్ల తిరిగినా ఫలితం లేక.. ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా నాకు ఇదొక్కటే మార్గం అని ఆ విద్యార్థి ఆవేదనతో చెప్పాడు. ప్రస్తుత కాలంలో కన్నతల్లి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఆ కొడుకుకు అంతా హ్యాట్సాప్ చెబుతున్నారు.