Breaking News

‘అభివృద్ధి’కి ఖర్చు చేయట్లే..

‘అభివృద్ధి'కి ఖర్చు చేయట్లే..

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) ను పూర్తిగా ఖర్చు చేయట్లేదు. మూడేళ్లుగా వారికి ఇస్తున్న నిధులను పూర్తిగా వినియోగించడం లేదని, గత ఆర్థిక సంవత్సరం అయితే సగం కూడా ఖర్చు చేయలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ కోరిన సమాచారం మేరకు ప్రభుత్వం వీటిని వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్), సీడీఎఫ్ కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిధులను తమ తమ నియోజకవర్గాల్లో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఇతర అభివృద్ధి పనులు చేయడానికి వినియోగించుకోవాలి. ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధికి ఏటా రూ.3కోట్లను సీడీఎఫ్ కింద అందిస్తున్నారు.

నిధుల కేటాయింపులు ఇలా..
తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి మూడుకోట్ల చొప్పున మొత్తం రూ.360 కోట్లను (ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకు కూడా) కేటాయించారు. అయితే 2017-18 నుంచి సీడీఎఫ్ కింద చేస్తున్న ఖర్చు క్రమంగా తగ్గుతోంది. 2017-18లో ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల్లో రూ. 276 కోట్లు ఖర్చయ్యాయి. ఇక ఆ తర్వాత ఏడాది అది రూ.240 కోట్లు కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎమ్మెల్యేలు రూ.163 కోట్లు మాత్రమే ‘అభివృద్ధి’ నిధులను ఖర్చుచేయడం గమనార్హం. ఇక ఎమ్మెల్సీల విషయానికొస్తే వారికి కేటాయించిన రూ.120 కోట్ల(2019-20) లో రూ.37 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎమ్మెల్యేలకు రూ.180 కోట్లు కేటాయించగా.. అందులో రూ.147కోట్లు ఖర్చయ్యాయి. ఎమ్మెల్సీకైతే వారికి ఇచ్చిన రూ.27 కోట్లను పూర్తిగా వినియోగించుకున్నారు.

ఎవరేమన్నారంటే..
దీనిపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినా వాటికి ఆమోదం లభించడానికి చాలా సమయం పడుతుందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సీడీఎఫ్ ను విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పందిస్తూ.. తనకు కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించుకున్నారని, కానీ చాలా ప్రాజెక్టుల్లో చేసిన పనులకు కూడా ప్రభుత్వం ఇంకా బిల్లులను విడుదల చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పనులు అంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇదే విషయమై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, చీఫ్ విప్ డి. భానుప్రసాద్ మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు ప్రతిపాదించే పనులకు సంబంధించిన అంచనాలు సరిగా లేకపోవడం, డిపార్ట్​మెంట్​ జాప్యం వల్ల నిధుల విడుదల ఆలస్యమవుతోందని తెలిపారు.