Breaking News

అప్పు పుట్టదు.. ఎవుసం సాగదు

  • తెలంగాణ రైతుల పరిస్థితి ఇది
  • ఖరీఫ్​ రుణాలకు సవాలక్ష కొర్రీలు
  • ఈ ఏడాది రూ.33,713 కోట్ల లక్ష్యం
  • ఇప్పటి వరకు ఇచ్చింది రూ.500కోట్లు


సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రైతులు పంట పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు రైతులందరికీ లోన్లు ఇవ్వడం లేదు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నా.. నిర్దేశించిన లక్ష్యంలో ఒక శాతం మేర కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తోంది. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం తెలంగాణ బ్యాంకర్ల తీరును తప్పుబట్టింది. మూడేళ్లలో రైతు రుణాల విషయంలో బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయాయని అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏటా రూ.పదివేల కోట్ల రైతు రుణాలకు బ్యాంకర్లు ఎగనామం పెడుతున్నాయని స్పష్టం చేసింది. తెలంగాణ రైతాంగానికి ఈ ఏడాది రూ.30,649 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అయితే కరోనా కారణంగా రైతులు కష్టాల్లో ఉన్నందున రుణాలను పదిశాతం మేర పెంచి రూ.33,713 కోట్ల మేర రుణాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ కేవలం రూ.500 కోట్ల మేర రుణాలను మాత్రమే మంజూరుచేసి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో బ్యాంకులు ఒక శాతం మేర కూడా రుణాలను మంజూరు చేయడం లేదని స్పష్టమవుతోంది.
పాత బకాయిలు చెల్లిస్తేనే..
తెలంగాణలో 5‌‌0లక్షల మంది రైతులు ఉన్నారు. బ్యాంకులు పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు మంజూరు చేస్తామని రైతులకు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు బకాయిలు చెల్లించడం లేదు. మొదటి విడత ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.25వేల మేర రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా బ్యాంకర్లు మాత్రం కొత్త లోన్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఉన్న అప్పు చెల్లిస్తేనే కొత్త రుణాలు మంజూరు చేస్తామని తెగేసి చెబుతున్నాయి. రాష్ట ప్రభుత్వం మొదటి విడతగా రూ.25వేల రుణమాఫీ చేస్తే.. అంత మేరనే కొత్త లోన్లు ఇవ్వగలమని అంటున్నారని రైతులు వాపోతున్నారు.
వడ్డీ వ్యాపారులే దిక్కు
ఖరీఫ్ పంట వేసేందుకు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రూ.వందకు రూ.3 లేదా రూ.5 చొప్పున మిత్తికి అప్పు తెచ్చుకుంటున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ రైతు రుణ విముక్తి కమిషన్ సైతం ధ్రువీకరించింది. బ్యాంకర్లు సకాలంలో క్రాప్ లోన్లు మంజురు చేయడం లేదని, ఎన్నో కొర్రీలు పెడుతున్నాయని, అందుకే ఏడాదికి 36 నుంచి 48 శాతం వడ్డీకి ప్రైవేట్​వ్యక్తుల నుంచి రుణాలు తెచ్చుకోవాల్సి వస్తుందని రాష్ట ప్రభుత్వానికి లేఖ రాసింది. 40 శాతం మేర రైతులకు రుణాలు రావడం లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు నివేదించింది. అయినా బ్యాంకర్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఏదో కారణంతో క్రాప్ లోన్ల కోసం వచ్చే రైతులను తిప్పి పంపిస్తున్నారు.